Dec 08,2022 21:32

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :జయహో బిసి పేరిట అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో వెనుకబడిన తరగతులకు ఒక్క కొత్త పథకం గానీ, అదనంగా నిధులు గాని ప్రకటించకపోవడం ఆ తరగతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త పథకాల సంగతి అటుంచితే గతంలో ఉన్న వాటికీ ఈ కాలంలో నిధులు కత్తిరించారని తెలిపారు. పేరుకు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. వివిధ వృత్తుల వారికి నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన పథకాలకూ వివిధ కారణాలతో (వయస్సు, లింగం, ఆర్ధిక హోదా మొదలగునవి) సుమారు సగం మంది, ఇంకొన్నింటిలో మూడింట రెండొంతుల మంది లబ్ధికి దూరంగా మిగిలిపోయారని పేర్కొన్నారు. వీటిని ఆన్‌లైన్‌లో సరిదిద్దేందుకు తగిన యంత్రాంగం లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో బిసిల సంక్షేమం కోసం, వివిధ వృత్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని, అర్హులైనవారందరికీ పథకాలు అందే విధంగా తప్పొప్పులను సరిదిద్దేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
సమాన అవకాశాలివ్వాలి...
జయహో బిసి పేరిట విజయవాడలో నిర్వహించిన సభ కోసం అధికార దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. సభకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులను తరలించారని,. వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చిన్నపాటి నిరసన కార్యక్రమానికి, సభలకు, ప్రదర్శనలకు విపరీత ఆంక్షలు విధించే పోలీసు యంత్రాంగం బుధవారం ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయమని తెలిపారు. అధికార యంత్రాంగం, పోలీసులు అన్ని పార్టీలూ, సంఘాల పట్ల సమదృష్టితో చట్టనిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నారు. దానికి భిన్నంగా అధికార పార్టీకి విచ్చలవిడిగా వెసులుబాటు కల్పించడం అప్రజాస్వామికమని పేర్కిన్నారు. అన్ని పార్టీలకు, ప్రజాసంస్థలకు సమాన అవకాశం కల్పించడం పోలీసు యంత్రాంగం బాధ్యతని, ఇకముందైనా అధికార, పోలీసు యంత్రాంగాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.