Oct 01,2022 13:03

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలో నటించాలని, పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని నటీనటీలు ఆసక్తి కనబరుస్తారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం.. రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో తాను నటించనను తేల్చి చెప్పారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. మెగాస్టార్‌ తాజాగా 'గాడ్‌ఫాదర్‌' చిత్రంలో నటించారు. ఈ చిత్రం మలయాళ మూవీ 'లూసిఫర్‌'కి రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆక్టోబర్‌ 5 వతేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిరు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన బాలీవుడ్‌కి చెందిన ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టు.. 'రాజమౌళి దర్శకత్వంలో మీరు నటించనని అన్నారు ఎందుకు' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి 'రాజమౌళి అద్భుతమైన దర్శకుడు. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ నటనలో పర్ఫెక్షన్‌ వచ్చేవరకూ, బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చేవరకూ వదలరు. ఓ నటుడిగా నేను ఆయన కోరుకున్నట్టుగా బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఆయన ఒక్క సినిమా కోసం.. మూడేళ్లు లేదా ఐదేళ్లవరకు సమయం తీసుకుంటారు. నేనేమో ఒకేసారి నాలుగు చిత్రాలతో బిజీగా ఉంటున్నా. అందుకే ఆయన దర్శకత్వంలో నటించి పాన్‌ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందాలని నాకు లేదు. కానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉంది' అని ఆయన సమాధానమిచ్చారు.
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కీలకపాత్ర పోషించారు. అలాగే హీరో సత్యదేవ్‌, డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌, హీరోయిన్‌ నయనతార, సముద్రఖని తదితర తారాగణంతో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించారు. సంగీతం ఎస్‌.ఎస్‌.తమన్‌ సమకూర్చారు. ఇక ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ తేజ, ఆర్‌బి చౌదరి, ఎన్‌.వి ప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.