ఈజీ మనీ కోసం ఆశపడితే ..!

బీహార్‌ : సైబర్‌ నేరగాళ్ళ ఆట కట్టించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా …. ఏదో ఒక వినూత్న దారుల్లో వారి ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం ఆశపడితే … అంతే సులువుగా ఈజీగా సైబర్‌ నేరగాళ్ళు మనీ కొట్టేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో అధిక రాబడులు, అధిక వడ్డీ, డిజిటల్‌ అరెస్టులు, హనీట్రాప్‌ ఇలా ఎన్నో రకాలుగా సైబర్‌ నేరగాళ్ల మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బీహార్‌లో ఓ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం మేరకు … ‘సంతానం లేని మహిళలను గర్భవతులుగా చేస్తే రూ.10 లక్షలు’ అని బీహార్‌లోని ఓ ముఠా యాడ్‌ ఇచ్చింది. ‘ఆల్‌ ఇండియా ప్రెగెంట్‌ జాబ్‌ సర్వీస్‌’, ‘ప్లేబారు సర్వీస్‌’ల పేరిట ఫేస్‌బుక్‌లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు సైతం పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆకర్షితులైన పలువురు ఆ ముఠాను సంప్రదించారు. మొదట ముఠా సభ్యులు బాధితుల నుంచి పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, సెల్ఫీ, ఇతర వివరాలు సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్‌, హౌటల్‌ గదుల బుకింగ్స్‌ పేరిట డబ్బు వసూలు చేశారు. ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. ఈ వ్యవహారమై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనంతరం నిందితులు ప్రిన్స్‌ రాజ్‌, భోలా కుమార్‌, రాహుల్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద బాధితుల వాట్సప్‌ ఛాట్‌, కస్టమర్‌ ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంక్‌ లావాదేవీలను గుర్తించారు. నవడా జిల్లాలో ఈ స్కామ్‌ బయటపడింది.

➡️