China : అంతరిక్షంలోకి తొలి చైనా మహిళా వ్యోమగామి

బీజింగ్‌ : చైనా తమ దేశం తరపున ఓ మహిళా వ్యోమగామిని తొలిసారి అంతరిక్షంలోకి పంపింది. ఈ మేరకు చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ (సిఎంఎస్‌ఎ) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గన్స్‌ ప్రావిన్స్‌లోని జియూక్వియాన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి షెంఝూ-19 మిషిన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఇందుకోసం లాంగ్‌మార్చ్‌-2ఎఫ్‌ అనే భారీ రాకెట్‌ను వినియోగించినట్లు తెలిపింది. వ్యోమగాముల్లో 34 ఏళ్ల మహిళా స్పేస్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌ వాంగ్‌ హవూజె కూడా ఉన్నారని, దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించిన వారు స్పేస్‌ స్టేషన్‌కు చేరుకొన్నారని సిఎంఎస్‌ఎ తెలిపింది. వీరు ప్రయాణించిన స్పేస్‌షిప్‌ అంతరిక్ష కేంద్రం కోర్‌మాడ్యూల్‌ తియాన్హేతో అనుసంధానమైందని ప్రకటించింది. ఈ ముగ్గురు వ్యోమగాములు ఆరు నెలలపాటు అక్కడే ఉండి వివిధ ప్రయోగాలను, స్పేస్‌వాక్‌ను నిర్వహిస్తారని తెలిపింది. 2030 నాటికి చంద్రుడి పైకి చేపట్టే యాత్ర దిశగా ఈ ప్రయోగం విజయవంతమైందని సిఎంఎస్‌ఎ పేర్కొంది. ‘వీరు వివిధ రంగాలకు చెందిన మొత్తం 86 ప్రయోగాలు నిర్వహిస్తారు. మిత్రదేశాల వ్యోమగాములకు కూడా శిక్షణ ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి’ అని సిఎంఎస్‌ఎ ప్రతినిధి చెప్పారు. ఈ ఏడాది మొత్తం 100 అంతరిక్ష ప్రయోగాలు చేసి నాసాను వెనక్కినెట్టాలని చైనా నిర్ణయించింది. విశ్వాన్ని అన్వేషించి అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదగాలని రెండేళ్లక్రితమే ఆ దేశాధ్యక్షులు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మిషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే ?
ఈ షెంజౌ-19లో మిషన్‌ కమాండర్‌ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్‌ లింగ్‌ డాంగ్‌, వాంగ్‌ హవోజ్‌ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్‌లో పాల్గని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్‌ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్‌గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్‌ ఏజెన్సీ మీడియాకు తెలిపారు.

6 నెలలు అక్కడే …
ఈ ముగ్గురు వ్యోమగాములు 6 నెలలపాటు అక్కడే ఉండి వివిధ ప్రయోగాలను, స్పేస్‌వాక్‌ను నిర్వహిస్తారు. దీనినుంచి వచ్చిన అనుభవంతో 2030 నాటికి చంద్రుడి పైకి యాత్రను చేపడతారు. ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ (సీఎంఎస్‌ఏ) ప్రకటించింది. ”వీరు వివిధ రంగాలకు చెందిన మొత్తం 86 ప్రయోగాలు నిర్వహిస్తారు. మా మిత్రదేశాల వ్యోమగాములకు కూడా శిక్షణ ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి” అని సీఎంఎస్‌ఏ ప్రతినిధి వివరించారు.

➡️