హాయిగా.. అంతరిక్షంలో షికారు..! డిన్నరు..! టిక్కెట్‌ ఎంతంటే ?

Mar 17,2024 12:59 #Dinner, #Space

ఇంటర్‌నెట్‌ : నదీ తీరాన, సముద్రంపై షిప్‌ల మీద, ఖరీదైన లగ్జరీ రెస్టారెంట్లలో, ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో… ఇలా వినూత్నంగా డిన్నర్‌ ప్లాన్స్‌ వేసుకొని చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. అదే అంతరిక్షంలో అయితే… సరదాగా భూమి నుండి లక్ష అడుగుల దూరంలోకి అంతరిక్షంలోకి జర్నీ చేస్తే … ఇటు సూర్యోదయం.. అటు సూర్యాస్తమయం..! చూస్తూ… గాల్లో తేలుతూ… మాంచి రుచికరమైన డిన్నర్‌ చేస్తుంటే..! ఆహా… ఆ ఊహే అద్భుతంగా ఉందికదూ… ఈ కొంగొత్త ఆలోచనతో ఓ వ్యాపారవేత్త అంతరిక్షంలో డిన్నర్‌ ప్లాన్‌ చేశాడు..! ఆ బిజినెస్‌ స్టార్టింగే మాంచి ఊపందుకుంది.. ముందు మాకు రిజిస్ట్రేషన్‌ చేయండి అంటూ… జనాలు కూడా ఎగబడుతున్నారు.. అసలు ఆ వివరాలేంటో తెలుసుకుందాం..!

బెలూన్‌లో ట్రిప్‌..! ప్రత్యేక పెఫ్‌ వంట.. వడ్డింపు..!
అంతరిక్ష పర్యాటకం ఊపందుకుంటున్న నేపథ్యంలో … తాజాగా ఓ సంస్థ అంతరిక్షంలో డిన్నర్‌ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. బెలూన్‌ ద్వారా నిర్వహించే ఈ ట్రిప్‌కు స్పేస్‌వీఐపీ అనే సంస్థ రూపకల్పన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్‌ షెఫ్‌ ను (పాకశాస్త్రనిపుణుడు) రంగంలోకి దింపింది. ప్రపంచంలో ఐదో అత్యద్భుత రెస్టారెంట్‌గా పేరుగాంచిన ప్రముఖ డానిష్‌ రెస్టారెంట్‌లో ఆయన షెఫ్ గా ఉన్నారు. హైటెక్‌ స్పేస్‌ బెలూన్‌ లో అతిథులకు షెఫ్‌ స్వయంగా ఆహారాన్ని వండిస్తారట..!

జర్నీకి మెనూ కూడా సృజనాత్మకమట..!
ఈ ట్రిప్‌లో భాగంగా పర్యాటకులు లక్ష అడుగుల ఎత్తున అంతరిక్షంలోకి బెలూన్‌లో వెళతారు. సూర్యోదయ, సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్‌ను ఎంజాయ్ చేస్తారు. ఈ డిన్నర్‌లో వడ్డించే ఆహారాన్ని రాస్మస్‌ మంక్‌ ఎంపిక చేయనుంది. అంతేకాదు, డిన్నర్‌ మొత్తాన్ని భూమ్మీదున్న శ్రేయోభిలాషులు, మిత్రులకు లైవ్‌స్ట్రీమ్‌ చేసే అవకాశం కూడా అతిథులకు కల్పించారు. ఇందుకోసం బెలూన్‌లో అత్యాధునిక వైఫైను కూడా ఏర్పాటు చేశారు. ఈ జర్నీ మెనూ ఇంకా సిద్ధం కాలేదట.. అయితే, ట్రిప్‌లాగానే మెనూ కూడా సృజనాత్మకంగా ఉండబోతోందని ప్రధాన షెఫ్ తెలిపారు. మరి ఆ మెనూ ఐటమ్స్‌ కూడా చూడాలి..!

ఒక్కో టిక్కెట్టు ధర సుమారు రూ.4.14 కోట్లు…
ఈ అంతరిక్ష పర్యటనకు ఒక్కో టిక్కెట్‌ ధర సుమారు 5 లక్షల డాలర్లుగా (సుమారు రూ.4.14 కోట్లు) ఉండొచ్చని సమాచారం. ధర ఇంత భారీగా ఉన్నా ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ట్రిప్‌ గురించి ప్రకటించిన 24 గంటల లోపే చాలామంది మా పేర్లు రిజిస్టర్‌ చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారట.

మొత్తం ఆరుగురు.. ప్రత్యేక క్యాప్సూల్‌లో సిట్టింగ్‌..!
ఈ అంతరిక్ష పర్యటనకు మొత్తం ఆరుగురిని తీసుకెళతారు. ఈ ట్రిప్‌లో భాగంగా అతిథులను ప్రత్యేక క్యాప్సూల్‌లో కూర్చోబెడతారు. నాసా సిద్దం చేసిన అంతరిక్ష బెలూన్ల సాయంతో ఈ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఈ ట్రిప్‌లో పాల్గోనేందుకు ముందస్తు ట్రెయినింగ్‌ ఏదీ అవసరం లేదని స్పేస్‌ వీఐపీ పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ క్యాప్సూల్‌, బెలూన్లపై పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది.

➡️