Savitri : అమ్మ వేటిని దొంగిలించేదంటే..? : ఆసక్తికర విషయాలను వెల్లడించిన కుమార్తె చాముండేశ్వరి

‘మహానటి యాక్టింగ్‌ రికార్డ్‌ ‘సావిత్రి క్లాసిక్స్‌’ 

తెలుగు తెరపై మహానటిగా పేరుతెచ్చుకున్న నటి సావిత్రి. ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి అనారోగ్య కారణాల వల్ల 45 ఏళ్లకే మృతి చెందింది. ఆమె గురించి తాజాగా తన కుమార్తె విజయ చాముండేశ్వరి ‘సావిత్రి క్లాసిక్స్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. కేవలం సావిత్రి నటకు సంబంధించిన ఫొటోలతో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా సావిత్రికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తన కుమార్తె చాముండేశ్వరి బయటపెట్టారు. ఈ బుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిక సంబంధించి చాముండేశ్వరిని పలు ప్రశ్నలు సురేఖ అడిగారు. వాటికి చాముండేశ్వరి ఏమని సమాధానాలిచ్చిందో తెలుసుకుందామా..?!

సురేఖ : ఈ బుక్‌ ఎందుకు రాయాలనిపించింది?
చాముండేశ్వరి : మహానటి మూవీ ఇప్పటికే విడుదలైంది. అసలు అమ్మకి మహానటి అని ఎందుకు పేరు వచ్చింది? ఆమె యాక్టింగ్‌ని బట్టే కదా. అందుకే అమ్మ ఎలాంటి పాత్రలు ఎంచుకుంది? వాటిల్లో తాను ఎలా నటించింది? షూటింగ్‌లో ఎలా ఉండేది? ఇవన్నీ భవిష్యత్‌ తరాలకు తెలియాలనే కేవలం ఫొటోల ఆధారంగా ఈ బుక్‌ని రూపొందించాం. దీనికి సంజరు బెస్ట్‌ ఆప్షన్‌. సంజరు దగ్గర అమ్మ ఫొటోగ్రాఫ్స ఉన్నాయి. ఆ ఫొటోలన్నీ సేకరించి.. ఆ ఫొటో పక్కన రైటప్‌ రాసి.. అమ్మ నటనకు సంబంధించి ఈ పుస్తకాన్ని ఓ రికార్డులా తయారుచేశాము. కేవలం ఈ బుక్‌ అమ్మ నటనకు సంబంధించి ఓ రికార్ట్‌.

సురేఖ : చిరంజీవి గారితోనే ఈ బుక్‌ని ఎందుకు రిలీజ్‌ చేయాలనుకున్నారు?
చాముండేశ్వరి : అమ్మ (సావిత్రి) అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. రోజూ ఉదయాన్నే ఆయన అమ్మ ఫొటోనే చూస్తారు. అమ్మ అంటే చిరంజీవికి అంత ఇష్టం. అందుకే ఆయన చేతనే ఈ బుక్‌ రిలీజ్‌ చేయించాలనుకున్నాను. మనసులో ఒకటి పెట్టుకుని.. పైకి ఒక్కటి చెప్పడం చిరంజీవి అలవాటు లేదు. ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ చేసేది ఒక్కటే. ఆయన వ్యక్తిత్వం నచ్చే.. ఆయన్ని అన్నలా భావించి ఈ బుక్‌ని ఆయన చేత రిలీజ్‌ చేయాలనుకున్నాను. అందుకే పట్టుబట్టి మరీ ఆయన చేతే ఈ పుస్తకాన్ని రిలీజ్‌ చేయించాను.

సురేఖ : చిన్నతనంలో అమ్మను బాగా మిస్‌ అయ్యేవారా?
చాముండేశ్వరి : చిన్నతనంలో అమ్మని బాగా మిస్‌ అయ్యేదాన్ని. ప్రతిరోజూ ఇంట్లో అమ్మ మమ్మల్ని దగ్గరుండి చూసుకునేది కాదు. నన్ను, తమ్ముడిని అమ్మమ్మే చూసుకునేది. వీలుదొరికినప్పుడల్లా మా కోసం సమయం కేటాయించేది. ఎప్పుడన్నా బీచ్‌కి వెళ్లాలనుకుంటే అందరిలా ఉదయమో, సాయంత్రమో కాకుండా.. బాగా చీకటి పడిన తర్వాత వెళ్లేవాళ్లం. కారులోనే అన్నీ సర్దుకుని పిక్నిక్‌కి వెళ్లినట్లు వెళ్లేవాళ్లం. అక్కడ సముద్రపు ఒడ్డున ఇసుకపై కూర్చొని అమ్మ మాకు అన్నం తినిపించేది. మాతో కలిసి చిన్నపిల్లలా అల్లరి చేసేది. ఎక్కడికైనా విహార యాత్రకు వెళితే మధ్యలో చింతచెట్లు కనిపిస్తే.. అక్కడ కారు ఆపి.. దానిపైకెక్కి చింత కాయలు, చింత చిగురుని కోసేది. వేరు శనగ పంట కనిపిస్తే దొంగతనంగా వేరుశనగ పంటను పీకి తెచ్చి వాటిని మాతో కలిసి తినేది. ఇలా మాతో ఉన్న కొద్ది సమయమైనా ఎంతో సంతోషంగా గడిపేది. అవి ఎప్పటికీ మాకు మధురమైన జ్ఞాపకాలే.

సురేఖ : మీకు ఇష్టమైనవి ఏంటి? వాటిని అమ్మ వండిపెట్టేదా?
చాముండేశ్వరి : నాకు చికెన్‌ అంటే ఇష్టం. ఇప్పుడు కెఎఫ్‌సి చికెన్‌లానే అప్పట్లోనే అమ్మ నాకు అది వండి పెట్టేది. తమ్ముడికి కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టం. ఇద్దరికిష్టమైనవి అప్పుడప్పుడు వండిపెట్టేది. షూటింగ్‌లకు మాత్రం అమ్మమ్మే వండిపంపేది.

సురేఖ : సావిత్రికి మోడ్రన్‌ డ్రెస్సులా? లేక సాంప్రదాయ దుస్తులంటే ఇష్టమా?
చాముండేశ్వరి : అమ్మకు సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. లంగావోణి, చీరలు ఇలాంటివే ఇష్టం. నేను ఎప్పుడన్నా మోడ్రన్‌ డ్రస్సులు వేసుకోవాలనిపిస్తే నాన్నని అడిగి కొనిపించుకునేదాన్ని.

సురేఖ : మీకేంటి డిఫరెంట్‌గా పాములంటే ఇష్టమా?
చాముండేశ్వరి : ఓరోజు మా ఇంటికి పాములు పట్టే వ్యక్తి వచ్చాడు. అతను మెడలో పాముని వేసుకుని దాన్ని ఆడించేవాడు. దాన్ని చూసి నాకు పాముతో ఆడుకోవాలనిపించింది. అమ్మ నా ఆసక్తిని గమనించి ఆ పాములు పట్టే వ్యక్తిని రోజూ ఇంటికి వచ్చి కాసేపు ఆడించి వెళ్లమని చెప్పింది. అలా నాకు పాములంటే ఇష్టమేర్పడింది. మా ఇంట్లో కుందేలు, నెమలితోపాటు రకరకాల పక్షులుండేవి. అవంటే అమ్మకెంతో ఇష్టం. ఇంట్లో ఓ భాగం జూ (జంతు ప్రదర్శనశాల)ని తలపిస్తుంది.

సురేఖ : మీరు నటిగా ఎందుకు కాలేదు?
చాముండేశ్వరి : అమ్మని, అక్క (రేఖ)ని చూసిన తర్వాత కూడా నాకు సినిమాల్లో నటించాలనిపించలేదు. అమ్మ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నాది, తమ్ముడి భవిష్యత్తు ఏమైపోతుందని కంగారుపడింది. అందుకే నాకు పదహారేళ్లకే అమ్మ దగ్గర బంధువు గోవిందరావుకిచ్చి పెళ్లి చేసింది. మా వివాహ జీవితం బాగుంది. నాకు గృహిణిగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే అమ్మ సినిమా షూటింగ్‌ల వల్ల మాతో సమయం కేటాయించడానికి కుదిరేది కాదు. నాతో అమ్మ ఎప్పుడూ ఉంటే బాగుండేది అన్న వెలితి ఉండేది. ఆ విషయంలో నా పిల్లలకు ఆ వెలితి ఉండకూడదనే నేను నటిని కాలేదు. గృహిణిగానే ఉండాలనుకున్నానను. నాకు హౌస్‌ వైఫ్‌గా ఉండటమంటేనే ఇష్టం. నాకు పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ చదివాను. నాన్నే నన్ను చదవమని ప్రోత్సహించారు.

సురేఖ : అమ్మ చనిపోయిన తర్వాత ఎలా ఫీలయ్యారు? ఆ తర్వాత నాన్నతో మీ సంబంధాలు ఎలా ఉండేవి?
చాముండేశ్వరి : నా బి.ఎ చివరి సంవత్సరం ఫైనల్‌ ఎగ్జామ్స్‌కి సరిగ్గా మూడు రోజుల ముందు అమ్మ కోమాలోకి వెళ్లిందని తెలిసింది. దాదాపు కొన్ని నెలలపాటు నేను ఆసుపత్రి చుట్టూ తిరాగాను. అమ్మ చనిపోయిన తర్వాత తమ్ముడి బాధ్యతను పూర్తిగా నాన్నే తీసుకున్నాడు. తనని బాగా చదించాడు. నేను కూడా ఇంటికెళ్లి వస్తూ వుండేదాన్ని. అమ్మ దానధర్మాలు చేసి ఆస్తిని పోగొట్టింది. మమ్మల్ని బీదరికంలో నెట్టింది అనే వార్తలు ఒట్టి పుకార్లే. ఆస్తి కొంత పోయినప్పటికీ నాకు, తమ్ముడికి ఇంకా కొంత ఆస్తి మిగిల్చింది. దాంతోనే నేను, తమ్ముడు హ్యాపీగా ఉన్నాం. అమ్మ చనిపోయిన తర్వాత తమ్ముడినే నాన్నే (జెమినీ గణేశన్‌) చదివించాడు. ఇప్పుడు తాను విదేశాల్లో సెటిలయ్యాడు.

సురేఖ : మీ పిల్లలు ఎవరైనా సినిమాల్లో నటించారా?
చాముండేశ్వరి : మా పిల్లలిద్దరికీ కళలంటే ఎంతో ఇష్టం. మా చిన్నోడు (అభినరు) ‘యంగ్‌ ఇండియా’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత రామానుజం సినిమాలో నటించాడు. ఆ సినిమాలో తన నటకు మంచి పేరొచ్చింది. క్రీడా నేపథ్యమున్న సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించాలని అభినరుకి కోరిక. ఇక మా పెద్దబ్బాయి షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించి వర్క్‌ చేస్తుంటాడు.

సురేఖ : మహానటి మూవీ చూసిన తర్వాత ఏలా ఫీలయ్యారు? అన్నీ కరెక్టుగానే తీశారా? అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవా?
చాముండేశ్వరి : మహానటి మూవీ చూసిన తర్వాత నాకెలాంటి అభ్యంతరకరమైనవి ఏమీ లేవు. అన్నీ కూడా నన్ను అడిగే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాల్లాంటివేవీ లేవు.

➡️