ఈ తప్పులు చేస్తే … త్వరగా ముసలివారవుతారు…!

లైఫ్‌ స్టయిల్‌ : మనిషి తన దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులతో సమయాన్ని దాటేస్తున్నాడు. వ్యక్తుల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గంటల తరబడి కుర్చీలో కూర్చొనే పని, వేళకు ఆహారం తినకపోవడం, ఒక వేళ … ఎప్పుడైనా ఆహారం తీసుకున్నా అది పౌష్టికాహారం కాకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, వ్యాయామం లేక శరీరం కుదేలవుతుంటే… మానసిక ఒత్తిడితో మరింతగా ఆరోగ్యం క్షీణించడం ఇవన్నీ రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయి… వీటి కారణంగా … చాలామంది చిన్న వయస్సులోనే ముసలివారవుతున్నారని, మధ్య వయస్సులోనే కాలం చేస్తున్నారని నిపుణుల తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి…!

గంటల తరబడి కూర్చోవడం…!
తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన ఆసక్తికర విషయమేమిటంటే … ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌, యూనివర్సిటీ ఆప్‌ కాలిఫోర్నియా రివర్స్‌సైడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఎలా చెప్పారంటే ?
28 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారిని ఎంచుకొని వారు వ్యాయామం చేస్తున్నారా లేదా ? వారు ఎలా కూర్చుంటున్నారు ? ఎంతసేపు కూర్చుంటున్నారన్న వివరాలను నిపుణులు సేకరించారు. వీరిలో ఎక్కువమంది 9 నుంచి 16 గంటలపాటు కదలకుండా కూర్చునే ఉంటున్నారని నిర్థారణ అయ్యింది. అలాగే ఇంకొందరైతే ఏకంగా వారానికి 60 గంటలు కూడా కదలకుండా కూర్చొని ఉంటున్నారని పరిశోధనల్లో వెల్లడయ్యింది.

కాసేపు వ్యాయామం చేస్తే సరిపోదు : పరిశోధకులు
అయితే ఎక్కువ సేపు కూర్చంటున్నాం కదా అని ఏదో పేరుకు కొద్దిసేపు వ్యాయామం చేస్తే సరిపోదని పరిశోధకులు చెబుతున్నారు. కచ్చితంగా రోజులో 30 నుంచి 45 నిమిషాల్లో వాకింగ్‌ లేదా ఏదో ఒక పద్ధతిలో వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అలాగే కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేచి ఒక వంద అడుగులైనా వేయాలని చెబుతున్నారు. లేదంటే నడుం చుట్టు కొవ్వు పేరుకుపోవడం, గుండె సంబంధిత సమస్యలు రావవడం, త్వరగా వఅద్ధాప్యం బారినపడడం వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

త్వరగా ముసలివాళ్లు కావొద్దంటే.. వైద్యులు ఏం చెబుతున్నారంటే ?
ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, కంటి నిండా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, స్మోకింగ్‌, డ్రింకింగ్‌ మానేయడం … ఈ అలవాట్లతో వృద్ధాప్యం నెమ్మదిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

8 లైఫ్‌ స్టయిల్‌ అలవాట్లు అకాల వృద్ధాప్యానికి కారణం…
ఒక వ్యక్తి ఏజింగ్‌ ప్రాసెస్‌లో జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ధూమపానం, మద్యపానం వంటి కొన్ని అలవాట్లు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. వీటితో సహా 8 లైఫ్‌స్టయిల్‌ హ్యాబిట్స్‌ అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి. ఈ అలవాట్లు మానకపోతే ఏజింగ్‌ ప్రాసెస్‌ వేగవంతం అయ్యి, త్వరగా ముసలివాళ్లు అవుతారు.

ఆ చెడు అలవాట్లు ఏమిటంటే ?
తక్కువ నిద్ర : రోజూ తగినంత నిద్ర పోకపోతే బాడీ నేచురల్‌ రిపేర్‌ ప్రాసెస్‌లు దెబ్బతింటాయి. ఇది ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీంతో చర్మం ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అంతేకాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి బాడీ టాక్సిన్స్‌ను ఎదుర్కోలేదు. మొత్తం మీద చర్మం సాగిపోతుంది, డార్క్‌ సర్కిల్స్‌, ముడతలు ఏర్పడతాయి. యూత్‌ఫుల్‌ లుక్‌ మెయింటైన్‌ చేయడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ కనీసం 7-8 గంటల నిద్రపోవాలి.

డీహైడ్రేషన్‌ : చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్‌ కారణంగా త్వరగా ముసలి వాళ్లు అవుతారు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ రిస్కులు పెరగకుండా రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగడం మంచిది.

ఒత్తిడి : ఒత్తిడికి గురయ్యేవారి స్కిన్‌ చాలా ఫాస్ట్‌గా ముడతలు పడిపోతుంది. ఒత్తిడి ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంది, ఇది చర్మాన్ని డల్‌గా చేస్తుంది. అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. కాబట్టి, ధ్యానం, యోగా లేదా ఫేవరెట్‌ హాబీ ద్వారా స్ట్రెస్‌ తగ్గించుకోవాలి.

వ్యాయామం చేయకపోవడం : క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఫలితంగా గ్లోయింగ్‌ స్కిన్‌ మీ సొంతమవుతుంది. ఏజింగ్‌ ప్రాసెస్‌ స్లోగా మారుతుంది. హెల్తీగా, ఎనర్జిటిక్‌గా జీవించడానికి తప్పనిసరిగా ఎక్సర్‌సైజు చేయాలి. లేదంటే స్థూలకాయం, డయాబెటిస్‌, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఆల్కహాల్‌ : అతిగా ఆల్కహాల్‌ తాగితే స్కిన్‌ డీహైడ్రేట్‌ అవుతుంది, ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది, కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది, ఇవన్నీ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. ఈ కారకాలు ముడతలు, డల్‌ స్కిన్‌, అన్‌ఈవెన్‌ స్కిన్‌ టోన్‌కు దారితీస్తాయి.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు : అన్‌హెల్తీ ఫుడ్‌ హ్యాబిట్స్‌ కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు, వాటికి బదులు హానికరమైన పదార్థాలు చేరతాయి. వీటి కారణంగా చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. పోషకాహార లోపం ఏజింగ్‌ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది, స్కిన్‌ యవ్వనాన్ని కోల్పోతుంది. ఫలితంగా సాగిపోతుంది. షుగర్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ కూడా చాలా హాని చేస్తాయి.

➡️