విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు : ఇస్రో తాజా నివేదిక

ఇస్రో : భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89 శాతం సరస్సులు పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏండ్లలో రెట్టింపు అయ్యిందని ఇస్రో పేర్కొన్నది. ‘శాటిలైట్‌ ఇన్‌సైట్స్‌.. భారత హిమాలయాల్లో విస్తరిస్తోన్న హిమాలయ సరస్సులు’ పేరుతో నివేదికను ఇస్రో సోమవారం విడుదల చేసింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 601 ( 89 శాతం) రెండు రెట్లు కంటే ఎక్కువ, పది సరస్సులు తమ పరిమాణం కంటే ఒకటిన్నర నుంచి రెండు రెట్లు, 65 సరస్సులు ఒకటిన్నర రెట్లు మేర విస్తరించాయని, వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేసింది.


గణనీయమార్పులు ….
భూ వాతావరణం వేడెక్కుతుండటంతో భౌగోళిక మార్పులు సంభవించి హిమనీనదాలు కరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం, ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించే దీర్ఘకాలిక ఉపగ్రహాలు తీసిన ఫోటోలను విశ్లేషించిన ఇస్రో…. నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు గుర్తించింది.

➡️