లక్నో/ డెహ్రాడున్ : ఉత్తరాఖండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కోడలిని వేధించి, తమ కుమారుడికి మరో వివాహం చేయాలన్న ఉద్దేశంతో కుట్రపన్ని కోడలికి అత్తామామలు హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చిన ఉదంతం వెలుగులోకివచ్చింది. ఉత్తప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్ అనే యువకుడితో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. దాదాపు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు. రూ.15 లక్షల కట్నంతో పాటు కారును బహుమతిగా ఇచ్చారు. అయితే పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే మరో పది లక్షల రూపాయలు అదనపు కట్నం కావాలని కొత్త కోడలిపై అత్తింటివారు వేధింపులకు పాల్పడ్డారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు చెప్పడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అనంతరం గ్రామంలోని పెద్దల మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, యువతిని తిరిగి అత్తింటికి పంపారు. అయితే, అప్పటి నుంచి మరింత ఎక్కువగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు, తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో కోడలిను హత్య చేసేందుకు అత్తమామలు కుట్ర పన్నారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు.
