ఎఐతో ఉద్యోగులకు షాక్

Jan 18,2024 12:50 #Technology

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఏడాది ప్రారంభంలోనే టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు షాక్‌ ఇచ్చాయి. అమెజాన్‌, గూగూల్‌ కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించాయి. అదే పరంపర ఇతర టెక్‌ కంపెనీల్లో కూడా కొనసాగనుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టెక్‌ కంపెనీలన్నీ కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)వైపు మొగ్గుచూపుతున్నాయి. దీని ప్రభావం వల్లే ఉద్యోగులు ఉపాధిని కోల్పోతున్నారని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

స్ట్రీమింగ్‌, స్టూడియో విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను అమెజాన్‌ తొలగించింది. అలాగే ట్విచ్‌ లైవ్‌, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌, ఆడిబుల్‌ ఆడియోబుక్‌ యూనిట్‌లో వందలాది ఉద్యోగులను టెక్‌ కంపెనీలు తొలగించినట్లు తాజాగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మొత్తంగా ఒక్క జనవరి నెలలోనే వివిధ టెక్‌ కంపెనీల్లో పనిచేస్తున్న 7,500 మందికి పైగా ఉద్యోగులకు కోత విధించినట్లు ట్రాకింగ్‌ వెబ్‌ సైట్‌  Layoffs.fyi. తెలిపింది. ఎఐ సాంకేతికతలో వెనుకబడిపోవాలని ఏ కంపెనీ కోరుకోదు. అందుకే ఇతర కంపెనీలతో పోటీపడే ఉద్దేశంతో ఎఐ టెక్నాలజీవైపే టెక్‌ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని డి.ఎ డేవిడ్‌సన్‌ అండ్‌ కో అనలిస్ట్‌ గిల్‌ లూరియా అన్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్‌, అమెజాన్‌ కంపెనీలు ఎఐ టెక్నాలజీలో చాలా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రేస్‌లో మైక్రోసాఫ్ట్‌ని వెనక్కినెట్టి తమ కంపెనీనే ముందు వరుసలో నిలబడాలని గూగుల్‌ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే గూగుల్‌ జెమిని మోడల్‌ని అభివృద్ధి చేస్తోంది. ఇక అమెజాన్‌ చాట్‌ జిపిటి-4 మోడల్‌కి పోటీగా ‘ఒలింపస్‌’ కోడ్‌నేమ్‌తో మోడల్‌ని అభివృద్ధి చేస్తోంది.

కాగా, గతేడాది (2023)లో టెక్‌ రంగంలో 168,032 మంది ఉద్యోగాలు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. మిగతా పరిశ్రమల కంటే.. టెక్‌ పరిశ్రమలోనే అత్యధిక ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారని చాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ సంస్థ ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

➡️