చదివేది ఒకటో తరగతి..80 కేజీల బరువు ఎత్తుతూ షాకిస్తున్న ఓ బాలుడు

అహ్మదాబాద్‌ : పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకి ఈ బాలుడు సరిగ్గా సరిపోతాడు. ఆ బాలుడి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా ఈ వయసు చిన్నారులు జ్ఞాపకశక్తిలో మెరుగ్గా ఉంటారు. అయితే ఈ వయసులో శక్తికి మించి బరువులు మోయగలుగుతారా? కానీ ఓ బుడతడు మాత్రం తన శక్తికి మించిన బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ ఆ బాలుడి గురించి తెలుసుకోవాలనుందా? గుజరాత్‌ సూరత్‌ నగరానికి చెందిన ఆ బాలుడి పేరు యతి జెఠ్వా. తాను రెండేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి జిమ్‌కు వెళ్లేవాడు. అక్కడ రోజూ జిమ్‌ చేస్తున్నవారిని చూసి జెఠ్వాకు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెరిగిందట. తండ్రి కూడా ప్రోత్సహించడంతో ప్రస్తుతం జెఠ్వా 80 కేజీల బరువును ఎత్తేస్తున్నాడు. ఇప్పటికే జెఠ్వా వెయిట్‌ లిఫ్టింగ్‌లో 17కు పైగా పతకాలు సాధించాడు. రోజూ స్కూల్‌కి వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం రెండుగంటలపాటు జిమ్‌లో ప్రాక్టీసు చేస్తానని జెఠ్వా చెప్పాడు. త్వరలో వంద కేజీల బరువును ఎత్తడానికి జెఠ్వా సిద్ధమవుతున్నాడట. జెఠ్వాకు కోచ్‌గా తన తండ్రే వ్యవహరించడం విశేషం.

➡️