భోపాల్ : ఓ తెలుగు ఎన్‌ఆర్‌ఐ ను అన్నాచెల్లెళ్లు కలిసి నకిలీ ప్రొఫైల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ.2.68 కోట్లు కాజేసిన వైనం వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2023లో ఆయనకు మ్యాట్రీమోనీలో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన బర్కా జైస్వానీ అనే పేరుతో ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలం ఆ ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత వాట్సప్‌లోనూ టచ్‌లోకి వచ్చారు. పెళ్లి పేరుతో నమ్మించిన ఆమె ఆ ఐటి యువకుడితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం కల అని పలు కారణాలు చెప్పి యువకుడి నుంచి డబ్బులు గుంజుకుంది. అలా … 2023 ఏప్రిల్ నుంచి గతేడాది జూన్ వరకు విడతలవారీగా రూ.2.68 కోట్ల నగదు తన, బంధువుల ఖాతాలో బదిలీ చేయించుకుంది. ఇటీవల ఆ యువకుడు బర్కాకు వీడియో కాల్ చేశారు. అందులో మాట్లాడిన అమ్మాయి …. మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్‌లో ఉన్న యువతిలా లేకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. డబ్బుల విషయం అడగ్గా పొంతన లేని సమాధానం చెబుతూ బర్కా దాటవేస్తూ వచ్చింది. దీంతో ఆ యువకుడు అమెరికా నుంచి ఇందౌర్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. బర్కా అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలిసింది. మ్యాట్రీమోనీలో ఓ మోడల్ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్‌తో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడి నుంచి తీసుకున్న డబ్బుతో వారు అప్పులు తీర్చి, కార్లు కొనుక్కున్నారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. చేసేది లేక ఆ ఐటి యువకుడు తలపట్టుకున్నాడు..!
మ్యాట్రిమోనీ సైట్ లో అన్నాచెల్లెళ్ల బురిడీ – ఎన్‌ఆర్‌ఐ కు రూ.కోట్ల కుచ్చు టోపీ…!
