తెలంగాణ : అంతవరకు సరదాగా చెరువులో ఈత కొడుతున్నవారికి, చేపలు పడుతున్నవారికి గుండె ఝుల్లుమనేలా భారీ కొండచిలువ కనిపించింది. అంతే దెబ్బకు ఆ చెరువులో ఒక్కరుంటే ఒట్టు …! ఆదివారం ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో జరిగింది. చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కింది..! వల బరువెక్కడంతో ఏదో పెద్ద చేపే పడింది.. ఇంకేముంది మా పంట పండిందనే ఆనందంలో మత్స్యకారులంతా ఎంతో కష్టపడి ఆ వలను బయటకు లాగి చూశారు. అంతే భారీ కొండచిలువ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. అప్పటివరకు ఆ చెరువులో సరదాగా ఆడుతున్నవారంతా గుడ్లప్పగించి నోరెళ్లబెట్టారు. నిన్న ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని చెరువు కట్ట వద్దకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరు చేశారు. ఆ కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు. ఎల్లమ్మ చెరువులో కొండచిలువ దొరకడంతో మత్స్యకారులతో పాటు, ప్రతి రోజు ఉదయం చెరువులో ఈత కొట్టే స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు.