బాంబులతో కాదు..బాణసంచాతో తలపడతా..! : ఫ్యాక్షనిస్టుల కొత్తట్రెండ్‌..!

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పాత సినిమాల్లో ఆయుధాలను ఒకరిపైఒకరు విసురుకుంటుంటే అవి ఆకాశంలో తారాజువ్వల్లా, భూచక్రాల్లా వెళ్లి ఒకదానితోఒకటి తలపడి కిందికిపడతాయి.. ఇంతవరకు బాంబులను వాడిన ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు తాజాగా…. దీపావళి టపాసులతో తలపడ్డారు. టిడిపి నేత వైసిపి నేత ఇంటిపై రాకెట్‌ షాట్‌ను వదిలితే… అటు నుండి వైసిపి నేత టిడిపి నేత ఇంటిపై మరో షాట్‌ వదిలారు.. ఈ విచిత్రాన్ని చూస్తూ స్థానికులు, పోలీసులు అవాక్కయ్యారు..! ఓహో.. ఇక బాంబులక్కరలేదు… దీపావళి పటాసులు ఉంటే చాలు..! ఇక ఆ వ్యాపారం ఊపందుకున్నట్లే అంటూ కొందరు ఛలోక్తులు విసిరారు..!

వివరాల్లోకెళితే … బాంబులతో పనిలేదు.. బాణాసంచా ఉంటే చాలు అంటూ … ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం … వైసిపి, టిడిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడి ఒక్కసారిగా దాడులకు దిగి ఒకరిపై ఒకరు రాళ్ళ రువ్వుకున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తాడిపత్రి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేంద్ర భద్రతా దళాలతో వైసిపి, టిడిపి పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. పరిస్థితి శాంతించింది అనుకుంటున్న సమయంలో… కొందరు అల్లరిమూకలు బాణాసంచాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఇంక ఫ్యాక్షనిస్టులు బాంబులను పక్కనపెట్టి కొత్త తరహాలో బాణాసంచా వాడుతున్నారని ఆకాశంలోకి పైకి వెళ్లి పేలిపోయే షాట్లను వినూత్నంగా అటు వైసిపి కార్యకర్తలు, ఇటు టిడిపి కార్యకర్తలు ప్రయోగిస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి ఇంటి పైకి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్‌ రెడ్డి ఇంటి పైకి పటాసు షాట్లను వదలి దాడులకు పాల్పడుతుండటంతో స్థానిక ప్రజలతో పాటు పోలీసులను సైతం విస్మయానికి లోనయ్యారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దీపావళి పండగకు వినియోగించే బాణాసంచాను సైతం ఫ్యాక్షనిస్టులు వదలడం లేదని దీంతో ఇక బాణాసంచా తయారీ చేసే వారణాసి కార్మికులకు ప్రతిరోజు పని ఉండేలా వుందంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

➡️