సైబర్‌ కేటుగాడి స్కెచ్‌ – చిత్తు చేసిన తెలివైన భార్య …!

జహీరాబాద్‌ అర్బన్‌ (తెలంగాణ) : ‘మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈడీ, పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు.. సహకరించండి’ అని సైబర్‌ కేటుగాళ్లు ఓ ఉద్యోగినికి వీడియో కాల్‌ చేసి మరీ బెంబేలెత్తించారు. అయితే ఆమె తెలివిగా వ్యవహరించి దుండగుల కుట్రను చిత్తు చేసింది.. ఈ ఘటన జహీరాబాద్‌లో జరిగింది.

ఎస్‌ఐ కాశీనాథ్‌ కథనం మేరకు … జహీరాబాద్‌ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (50)కి మంగళవారం ఉదయం ‘ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్‌శర్మ’ పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈడీ, పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు.. సహకరించండి’ అంటూ కాల్‌ కట్‌ చేశాడు. వెంటనే వీడియో కాల్‌ ద్వారా ‘ముంబయి ఎస్పీ ప్రదీప్‌’ను అంటూ మరో వ్యక్తి వీడియో కాల్‌లో కనిపించాడు. ” కదలకుండా కూర్చోండి.. మీ భార్యను పిలవండి… ఇంటి తలుపులు మూసేయండి… ఎక్కడికీ వెళ్లకండి …” అని షరతులు పెట్టి ఆ దంపతులను అరగంటసేపు రకరకాల ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అయితే ఇంతలో బాధితుడి భార్యకు అనుమానం వచ్చి … చాకచక్యంగా వ్యవహరించింది. కాస్త నీళ్లు తాగొస్తానని అనుమతి అడిగి, మరో ద్వారం నుండి బయటకు వెళ్లి వెంటనే డయల్‌ – 100 కు ఫోన్‌ చేసి విషయమంతా చెప్పింది. వెంటనే స్పందించిన పట్టణ ఎస్సై స్థానిక సైబర్‌ వారియర్‌ రషీద్‌తోపాటు సిబ్బందిని సదరు ఇంటికి పది నిమిషాల్లో పంపారు. వారిని గమనించిన కేటుగాడు.. ఎవరొచ్చారు.. ? ఎందుకొచ్చారు ? అంటూ కంగారుపడుతూ వెంటనే వీడియో కాల్‌లో ముఖం కనిపించకుండా దాచుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ సైబర్‌ మోసగాళ్ల వివరాలను రాబట్టడానికి ప్రయత్నించారు. ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్‌ కట్‌ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. డిజిటల్‌ అరెస్టులు, విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్‌, వీడియో కాల్స్‌ను నమ్మొద్దని, పోలీసు, ఈడీ అధికారులెవరూ డిజిటల్‌ అరెస్టులు చేయబోరని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

➡️