అంతరిక్ష కేంద్రంలో సునీత సంతోషంతో డ్యాన్స్‌.. వీడియో వైరల్‌..

వాషింగ్టన్‌ : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడవసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు కూడా ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సునీత డ్యాన్స్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఐఎస్‌ఎస్‌లో భారరహిత స్థితి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లో సునీత చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ … ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని అన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు.

ఇది తొలి మానవ సహిత యాత్ర …!
బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్‌ఎస్‌తో బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్‌ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.

➡️