‘వర్క్‌లో బిజీ అయ్యాం .. మా పాపను దత్తత తీసుకుంటారా ?’ : దంపతుల పోస్టు వైరల్‌

Apr 3,2024 12:44 #adopt, #baby, #Couple's post, #Viral Video

ఇంటర్‌నెట్‌ : ” టైం లేదు .. వర్క్‌లో బిజీ అయ్యాం .. మా పాపను దత్తత తీసుకుంటారా ? ” అని ఓ దంపతులు సోషల్‌ మీడియాలో రెడిట్‌ వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది.

మేం వర్క్‌ హాలిక్‌లం : పాప తండ్రి
3 నెలల పాప ఎలిజబెత్‌ను దత్తత ఇద్దామనుకుంటున్నట్లు ఆ జంట ప్రకటించారు. వారు తమ ఉద్యోగాల్లో బిజీగా ఉన్నామని, అందువల్ల పాపను చూసుకోవడానికి సమయం ఉండటం లేదని అన్నారు. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తాను, తన భార్య ఆఫీసు పనుల్లో బిజీగా ఉండడం వల్ల తమ కుమార్తె ఎలిజబెత్‌కు కావలసిన అవసరాలను సమకూర్చడానికి పనిని వదులుకోవాల్సి వస్తుందని, వర్క్‌ హాలిక్‌లైన తాము అలా చేయలేకపోతున్నామన్నారు. పాపకి తన భార్య పాలు పట్టడం, దుస్తులు మార్చడం, స్నానం చేయించడం తప్ప ఇంకేమీ చేయదన్నారు. ఇప్పటివరకు తామెప్పుడూ ఎలిజబెత్‌తో సమయం కూడా గడపలేదని, చిన్నారిని ఆమె అమ్మమ్మ చూసుకుంటున్నారని తెలిపారు. బిడ్డను ప్రసవించిన రెండు వారాలకే తన భార్య తిరిగి విధుల్లో చేరిందని పనిపై ఆమెకున్న నిబద్దత అలాంటిదని అన్నారు. దంపతులు తమ చిన్నారిని ఆమె అమ్మమ్మ కాని, కుటుంబంలోని ఇతరులు కాని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. వారు ముందుకురాకపోతే ఇతరులెవరికైనా దత్తత ఇస్తామని రెడిట్‌లో పోస్టు పెట్టారు.

రోబోలా.. గ్రహాంతరవాసులా ? : నెటిజన్‌ ఆగ్రహం
ఈ పోస్టు కాస్తా వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టు పిల్లలపై, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యత గురించి నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ … ” మీరు ప్రేమాభిమానాలు లేని రోబోలా, లేక మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతర వాసులా ” అంటూ మండిపడ్డారు.

➡️