టాయిలెట్స్‌ లేక తీవ్ర ఇబ్బందులు : సర్వే

లండన్‌ :  పని ప్రదేశాల్లో కార్మికులు సరైన టాయిలెట్‌ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. బకెట్లు, బాటిల్స్‌, ప్లాస్టిక్‌ బ్యాగుల్లో మూత్రవిసర్జన చేయాల్సి వస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. సంబంధిత కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 4,000మందికి పైగా కార్మికులపై ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఈ అధ్యయనం చేపట్టింది. కార్మికుల అవసరాలపై ముఖ్యంగా టాయిలెట్స్‌ ఆవశ్యకతపై యజమానుల నిర్లక్ష్యాన్ని మంగళవారం ప్రచురితమైన ఈ నివేదిక ఎత్తి చూపింది.

ఈ అంశం కార్మికులపై ఒత్తిడి పెంచడమే కాకుండా ఆరోగ్యం, శుభ్రత సమస్యలను కూడా సృష్టించిందని టియుసి హెచ్చరించింది. సభ్యులు ఎదుర్కొంటున్న టాయిలెట్స్‌ సమస్యపై ట్రెయిన్‌ డ్రైవర్ల యూనియన్‌ అస్లెఫ్‌ ఈవారం వెస్ట్‌మినిస్టర్‌, స్కాటిష్‌ పార్లమెంట్‌లలో ‘డిగ్నిటీ ఫర్‌ డ్రైవర్స్‌’ పేరిట ప్రదర్శన చేపట్టింది. తక్కువ టాయిలెట్స్‌, అసలు అందుబాటులో లేని ఉద్యోగాల్లో కార్మికులు కొనసాగుతున్నట్లు టియుసి పేర్కొంది.

ఒక్కోసారి పబ్లిక్‌ టాయిలెట్స్‌ అందుబాటులో ఉండవని, దీంతో బాటిల్‌, గరాటు, వైప్స్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ను తన వ్యాన్‌ వెనుకభాగంలో ఎప్పుడూ ఉంచుకుంటానని పోస్టల్‌ ఉద్యోగి తెలిపారు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌, బాటిల్స్‌ను వినియోగిస్తామని రైలు ఉద్యోగి వివరించారు. నైట్‌షిప్ట్‌ సమయంలో ఎక్కువ నీరు తాగనని ఓ మహిళా అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉందని, ఒక్కోసారి అర్థరాత్రి సమయంలో అగ్ని ప్రమాద స్థలానికి వెళ్లాల్సి వుంటుందని, అక్కడ టాయిలెట్స్‌ ఉండే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. పురుష కార్మికులు అధికంగా ఉంటారని, వారి ముందు పలుమార్లు టాయిలెట్‌కు వెళ్లడం కూడా అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

టాయిలెట్స్‌ అవసరాల కోసం బాటిల్స్‌, బకెట్‌లను వినియోగించడం ఎవరికీ గౌరవం కాదని టియుసి అసిస్టెంట్‌ జనరల్‌ కేట్‌ బెల్‌ పేర్కొన్నారు. టాయిలెట్‌కు వెళ్లకుండా వేచి ఉండటం కూడా ప్రమాదకరమని, అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. దీర్ఘకాలంగా వేచిచూస్తున్న ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూడాలని అస్లెఫ్‌ జనరల్‌ సెక్రటరీ మిక్‌ వాలన్‌ పేర్కొన్నారు. ట్రెయిన్‌, ఫ్లైట్‌ నిర్మాణాల్లో సిబ్బంది కోసం సాఫ్ట్‌ టాయిలెట్‌లను కూడా నిర్మించాలని సూచించారు. పాతవాటిని ఆధునీకరించే సమయంలో టాయిలెట్స్‌ను అమర్చాలని అన్నారు. బస్సు డ్రైవర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని , టాయిలెట్‌ సదుపాయం కూడా వారి హక్కే నని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి షారన్‌ పేర్కొన్నారు. ఇది 21వ శతాబ్దంలో కార్మికులకు ఇప్పటికీ టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం సముచితం కాదని అన్నారు.

➡️