ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ నిర్వహించేందుకు తొలుత పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసినా, అభ్యర్థుల కోరిక మేరకు ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 284ను విడుదల చేశారు. జులై 3 నుంచి ప్రారంభమైన ఫీజు చెల్లింపు, దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 3 వరకు ఉంటుంది. మాక్‌టెస్ట్‌లు సెప్టెంబరు 19న ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 22 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేపర్ 1-ఎ, 1-బి, పేపర్-2 ఎ, 2-బి పరీక్షలు అక్టోబరు 3 నుంచి 20 వరకు రెండు సెషన్స్‌లో జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహు 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహుం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. అక్టోబరు 4న పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, 5 నుంచి అభ్యంతరాలను స్వీకరించి, 27న తుది ‘కీ’ విడుదల చేస్తారు. నవంబరు 2న తుది ఫలితాలను ప్రకటిస్తారు.
