ఇంటర్‌నెట్ డెస్క్ : యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విలయతాండవాన్ని మరిచిపోయి కాస్త కోలుకుంటుండగా … ఇప్పుడు ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలకలం వణికిస్తోంది. ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఈ ఎంపాక్స్ వైరస్ ఇప్పుడు పొరుగుదేశం పాకిస్తాన్‌కు చేరడం మరింత ఆందోళన కలిగిస్తుంది. సౌదీ నుండి వచ్చిన ముగ్గురు పాక్ పౌరులకు మంకీపాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఇప్పుడు ఈ వ్యాధి వ్యక్తుల జననాంగాలపై కూడా వస్తుండటంతో కేసులను గుర్తించడం కష్టంగా మారింది..!
సౌదీ నుండి వచ్చిన ముగ్గురికి నిర్థారణ…
ఆగస్టు 3వ తేదీన సౌదీ నుండి వచ్చిన ముగ్గురు వారి స్వదేశమైన పాక్‌కు చేరడంతో ఎంతోమందిని కలిశారన్న ఆందోళన నెలకొంది. ఆ ముగ్గురికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా వారికి మంకీపాక్స్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. విమానంలో వారితోపాటు ప్రయాణించిన వ్యక్తులతోపాటు సన్నిహితులను కూడా అధికారులు పిలిచి పరీక్షిస్తున్నట్లుగా పాక్ ఆరోగ్య శాఖ పేర్కొంది.
122 దేశాల్లో 99 వేల 518 కేసులు : డబ్ల్యుహెచ్‌ఒ
2023లో పాక్‌లో 11 మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా, ఒకరు మరణించారు. మరోవైపు ఐరోపా దేశం స్వీడన్‌లో కూడా ఎంపాక్స్ తొలి కేసు వెలుగుచూసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొన్ని చోట్ల ఈ ఎంపాక్స్ వైరస్ వల్ల మరణాల రేటు 3 నుండి 4 శాతంగా ఉంది. ఇప్పటివరకు 122 దేశాల్లో 99 వేల 518 కేసులు వెలుగుచూసినట్లు డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది.
జననాంగాలపై గుర్తింపు .. కేసుల గుర్తింపు కష్టం..!
ఆఫ్రికా దేశాలను ఇప్పటికే మంకీపాక్స్ వణికిస్తోంది. ఆ దేశాల్లో 96 శాతం కేసులు కాంగోలోనే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న 13 దేశాల్లో మిగిలిన కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఈ వైరస్ విస్తరిస్తూ మరణాల రేటును పెంచుతుంది. గతంలో ఎంపాక్స్ ఛాతీ, చేతులు, పాదాలపై ప్రభావం చూపితే ప్రస్తుతం ఈ వేరియంట్ జననాంగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టంగా మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో ఇప్పటివరకు 15 వేల 600కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, 537 మందికిపైగా బలయ్యారు.
మంకీపాక్స్ లక్షణాలు ..
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చేతులు దురద, పొక్కులు ఈ ఎంపాక్స్ వైరస్ లక్షణాలు. కళ్లు , నోరు, మలమూత్ర విసర్జన ప్రాంతాల్లో పొక్కులొస్తాయి.