న్యూఢిల్లీ : ప్రముఖ గాయని చిన్మయి పాటలు పాడడమే కాదు.. సినిమాల్లో సమంతకు తన గొంతు కూడా అరువిస్తారు. ఇటు పాటల్లోనూ.. అటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చిన్మయి మంచి పేరు సంపాదించుకున్నారు. తన వృత్తిపరంగానే కాదు.. మహిళలపై జరుగుతున్న దారుణాలపై కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. గత శుక్రవారం జార్ఖండ్‌లో స్పెయిన్ మహిళపై అత్యాచారం జరిగింది. తాజాగా ఈ ఘటనపై ‘భారతీయులందరూ సిగ్గుపడాలి’ అని చిన్మయి స్పందించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కొంతమంది భారతీయులు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నప్పుడు భారతీయులందరూ గర్వపడగలిగితే.. కొంతమంది పురుషులు అత్యాచారం చేసినప్పుడు భారతీయులందరూ కూడా సిగ్గుపడవచ్చు’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.కాగా, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్, నటి రిచా చడ్డా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు చట్టపరంగా శిక్ష పడాలని వారు డిమాండ్ చేశారు.
భారతీయులందరూ సిగ్గుపడాలి : స్పెయిన్ మహిళ గ్యాంగ్ రేప్‌పై స్పందించిన చిన్మయి
