ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదంతో బయటపడిన నగదు
సుప్రీంకోర్టు ఆంతరంగిక విచారణ
కఠిన చర్యలకు కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్క చూపని సొమ్ము పెద్ద మొత్తంలో లభించడంతో ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆంతరంగిక విచారణ చేపట్టింది. యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన సొమ్ముకు సంబంధించి నివేదిక అందజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఆదేశించింది. యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడ వారికి భారీగా నగదు లభించింది. తాజా పరిణామం నేపథ్యంలో జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిప్పి పంపాలని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.
సమావేశమైన ఫుల్ కోర్టు
సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులందరూ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. దీనినే న్యాయ పరిభాషలో ఫుల్ కోర్ట్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎక్కువమంది న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనం. యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుల్ కోర్ట్ సూచించింది. ముందుగా యశ్వంత్‌ను బదిలీ చేసి, ఆ తర్వాత ఆంతరంగిక విచారణ జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. జస్టిస్ వర్మ నివాసంలో నగదును స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాల వీడియోను అధికారులు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఆయన దానిని చూసి, కొలీజియంలోని ఇతర సభ్యులకు వివరాలు తెలియజేశారు. జడ్జి నివాసంలో ఎంత డబ్బు ఉన్నదీ తెలియరాలేదు. ఈ నెల 14వ తేదీ రాత్రి 11.30 గంటలకు వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు. 82 సంవత్సరాల తల్లి, కుమార్తె మాత్రమే ఉన్నారు. వారిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఓ గదిలో పెద్ద మొత్తంలో నగదు కన్పించింది. అందులో కొంత నగదు ప్రమాదంలో కాలిపోయింది. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ప్రభుత్వాధికారులు ఈ ఉదంతాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన కొలీజియంను సమావేశపరిచి పరిస్థితిపై చర్చించారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు సీనియర్ న్యాయమూర్తులైన బిఆర్ గవారు, సూర్యకాంత్, అభరు ఎస్ ఓకా, విక్రమ్ నాథ్ సభ్యులుగా ఉన్నారు.
జస్టిస్ వర్మ శుక్రవారం కేసుల విచారణ చేపట్టలేదని, సెలవు పెట్టారని ఆయన కోర్టు సిబ్బంది తెలియజేశారు. జస్టిస్ వర్మ 2006 నుండి పదోన్నతి పొందే వరకూ అలహాబాద్ హైకోర్టుకు ప్రత్యేక కౌన్సిల్‌గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. 2013లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 2021 అక్టోబర్ 11 నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయన మాకొద్దు : అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్
జస్టిస్ యశ్వంత్ వర్మను తమ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ (హెచ్‌సిబిఎ) వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనను చూస్తుంటే ‘అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్తబుట్టా అనే ప్రశ్న తలెత్తుతోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో బార్ అసోసియేషన్‌ను ఎన్నడూ సంప్రదించలేదని తెలిపింది.
బదిలీ ప్రారంభం మాత్రమే : సిజెఐ
జడ్జి బదిలీ ప్రారంభం మాత్రమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తోటి న్యాయమూర్తులతో అన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుండి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవహారంలో అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అది ఎవరి సొమ్ము : కాంగ్రెస్
నగదు పట్టుబడిన ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు జడ్జిని బదిలీ చేసినంత మాత్రాన సరిపోదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి నుండి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం తీవ్రమైన విషయమని కాంగ్రెస్ మీడియా – ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు. ‘జస్టిస్ వర్మ ఉన్నావ్ లైంగిక దాడి కేసును, అనేక తీవ్రమైన కేసులను విచారిస్తున్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించాలంటే అది ఎవరి డబ్బు, దానిని జడ్జికి ఎందుకు ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది’ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడుతూ ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల కంటే అగ్నిమాపక దళమే మంచి పనిచేసిందని వ్యాఖ్యానించారు.