మత్స్యకారులకు చేపల పులుసు వండి వడ్డించిన హీరో నాగచైతన్య..!

ఇంటర్‌నెట్‌ : మత్స్యకారుల కోసం హీరో నాగచైతన్య మొదటిసారి చేపల పులుసును వండి రుచి చూపించారు..! అది కూడా మామూలుగా కాదు… కట్టెలపొయ్యి పై మట్టి పాత్రలో …! ఘుమఘుమలాడే ఆ చేపల పులుసును అంతా తిని వాహ్  అన్నారు..! ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్‌ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో హీరో నాగచైతన్య మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, నాగచైతన్య ఓ ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. అందులో ఆయన రుచికరమైన చేపల పులుసును వండటం చూడొచ్చు..! ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర పోషించేందుకుగాను నాగచైతన్య కొందరు మత్స్యకారుల జీవితాలను దగ్గరనుండీ పరిశీలించి, తనను ఆ పాత్రకు అనుగుణంగా మలుచుకున్నారు. ” మీరు వండినట్టే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి మీకు వడ్డిస్తాను ” అని షూటింగ్‌ ప్రారంభంలో ఆ మత్స్యకారులకు నాగచైతన్య మాటిచ్చారట. అన్నట్టుగానే ఆయన మాట నిలుపుకున్నారు. కట్టెల పొయ్యిపై మట్టి పాత్రను ఉంచి… అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కలను వేసి… ఉప్పు, కారం, పసుపు పట్టించి… అందులో కొంచెం నూనె వేసి…. తగినంత చింతపండు పులుసు పోసి… చివర్లో కాస్తంత కొత్తిమీర చల్లి… ఘుమఘుమలాడే చేపల పులుసును తయారు చేశారు. తనకు సహకారం అందించిన మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనాన్ని విస్తరాకుల్లో పెట్టారు. నచ్చిందా ? అని అడిగారు. అది తిన్న వారందరూ వాహ్ అని మెచ్చుకున్నారు. అప్పటికీ నాగచైతన్య… ” నేను చేపల పులుసు వండడం ఇదే ఫస్ట్‌ టైమ్‌… బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దు ” అంటూ నవ్వుతూ చెప్పారు. తాను కూడా వారితో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

➡️