దొంగ భక్తుల పంగనామం – బంగారు గొలుసుపోయి పూజారి ఆగమాగం..!

Feb 9,2025 13:39 #krishna, #poojari, #thiefts

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : ‘ మీ ఒంటిపై బంగారాన్ని తాకితే కలిసొస్తుంది.. కాస్త ఆ మెడలో బంగారాన్ని ఇలా చేతికివ్వండి పూజారి గారూ… అని ఇద్దరు భక్తితో అడిగారు… అవునా అంటూ … ఆనందంగా ఇదిగోండి నాయనా.. అని ఆ పూజారి తన మెడలో ఉన్న బంగారు గొలుసును వారి చేతికిచ్చాడు.. ఇంకేముంది.. అంతే.. ఠక్కున అక్కడి నుండి బైక్‌ పై ఆ ఇద్దరూ ఉడాయించాడు ‘ ఆ పూజారి లబోదిబోమన్నాడు. ఈ ఘటన ఆదివారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నం గొడుగు పేట లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పూజారి పనిచేస్తున్నారు. యథాప్రకారం ఈరోజు కూడా స్వామివారికి పూజ చేస్తుండగా ఆలయంలోకి ఇద్దరు దొంగ భక్తులు వచ్చారు. ఆలయం బయటికి వచ్చి ఆశీర్వదించాలని పూజారిని కోరారు. ఆలయం గోపురం వద్దకు వెళ్లి ఆ ఇద్దరినీ పూజారి ఆశీర్వదించారు. ఆశీర్వచనం అందించిన అనంతరం పూజారి మెడలోని బంగారు గొలుసును తాకుతానంటూ … ఆ ఇద్దరు భక్తులూ కోరారు. పూజారుల ఒంటిపై బంగారాన్ని తాకితే తమకు కలిసొస్తుందని పూజారిని నమ్మించారు. అలాగేనంటూ మెడలోని బంగారపు గొలుసును తీసి ఆ పూజారి ఆ ఇద్దరికి ఇచ్చాడు. గొలుసును కళ్ళకు అద్దుకొని బైక్‌ పై అక్కడి నుండి ఆ ఇద్దరూ ఉడాయించారు. ఈ విషయం తెలుసుకుని ఆలయం వద్దకు ఇనకుదురుపేట పోలీసులు చేరుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️