Sep 29,2022 21:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకానికి సంబంధించి వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచారశాఖ కమిషనరు టి విజయకుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తులో భాగంగా ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన వధూవరులకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.1.20 లక్షలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల వధూవరులకు రూ.50 వేలు, బిసిలలో కులాంతర వివాహాలకు రూ.75 వేలు, ముస్లిం, మైనారిటీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.లక్ష అందిస్తామని తెలిపారు. వికలాంగుల వివాహాలకు రూ.1.50 లక్షలను, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40 వేలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి వధువు వయసు 18, వరుడు వయసు 21 ఏళ్లు కచ్ఛితంగా ఉండాలని తెలిపారు. ఈ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.