Oct 13,2021 22:31

ధర్మల్‌ కేంద్రం ప్రధాన ముఖద్వారం

10 గంటల ముచ్చటే ..!
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి కృష్ణపట్నం ఎపి జెన్‌కో రెండో యూనిట్‌ మళ్లీ షట్‌డౌన్‌ అయింది. 10 గంటల సమయానికే ఆగిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు జెన్కో రెండో యూనిట్‌ ప్రారంభించారు. 310 నుంచి 305 మెగావాల్ట్‌ విద్యుత్‌ ఉత్పత్తి అయింది. రాత్రి 1.30 గంటలకు ట్యూబు దెబ్బతినడంతో రెండో యూనిట్‌ ఉత్పత్తిని అధికారులు నిలపేశారు. ప్రస్తుతం ఎపి జెన్‌కోలో ఒక్క యూనిట్‌ మాత్రమే నడుస్తోంది. కేవలం 500 మెగావాల్ట్‌ మాత్రం ఉత్పత్తి అవుతోంది. కృష్ణపట్నంలోని ధర్మల్‌ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం నెలకు సరిపడ బొగ్గు నిల్వలున్నాయి. అటు తరువాత పరిస్థితి ఏమిటనేది అధికారులు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం ఎపి జెన్‌కో వద్ద 42 వేల మెట్రిక్‌ టన్నులు బొగ్గుఉంది. ప్రతి రోజూ కనీసం 1300 నుంచి 1500 టన్నులు బొగ్గు వినియోగం జరగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం నెలకు మాత్రమే బొగ్గు నిల్వలు సరిపోనున్నాయి. ప్రయివేటు ధర్మల్‌ ప్రాజెక్టులు వద్ద నెలకు సరిపడ నిల్వలున్నాయి. ఎపి జెన్‌కో రెండో యూనిట్‌ మూతపడడంతో అధికారులకు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో విదేశీ, స్వదేశీ బొగ్గు ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు నడుస్తున్నాయి. గతంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న సింహపురి, మీనాక్షి ధర్మల్‌ ప్రాజెక్టులు మూత పడడంతో ఇక్కడ నుంచి అతితక్కువ మెగావాల్ట్‌ మాత్రం ఉత్పత్తి జరుగుతోంది. ఏపి జెన్‌కో ఇక్కడ రెండు 800 మెగావాల్ట్‌ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఐదు నెలల క్రితం ఎపి జెన్‌కో ఒక యూనిట్‌ను మూసేసింది. ఇందుకు ప్రధాన కారణం బొగ్గు లేకపోవడమేనని తెలుస్తోంది. ఒక్క యూనిట్‌లో ప్రతి రోజూ 485 నుంచి 500 మెగావాల్ట్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ప్రతి రోజూ 750 నుంచి 800 టన్నులు బొగ్గు వినియోగిస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో ఐదు నెలలుగా మూతపడిన రెండో యూనిట్‌ను మంగళవారం 3.45 గంటలకు ప్రారంభించింది. రాత్రి 1.30 గంటల వరకు 305 నుంచి 310 మెగావాల్ట్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. ఒక్కసారిగా ట్యూబ్‌ దెబ్బతినడంతో యూనిట్‌ను అర్దాంతరంగా నిలిపేశారు. ప్రస్తుతం ఎపి జెన్‌కో ఒక్క యూనిట్‌ మాత్రమే నడుస్తోంది. బుధవారం 495 నుంచి 500 మెగావాల్ట్‌ విధ్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఎపి జెన్‌కో వద్ద సింగరేణి, విదేశీ బొగ్గు నిల్వలు సుమారు 42 వేల మెగావాల్ట్‌ వరకు ఉన్నాయి. ప్రస్తుతం జెన్‌కో రెండు యూనిట్స్‌ సరిగా పనిచేస్తే రోజుకు రూ.1300 నుంచి 1500 టన్నులు బొగ్గు అవసరం ఉంటుంది. దెబ్బతిన్న రెండో యూనిట్‌ను పునరుద్దించే పనిలో అధికారులున్నారు. కేవలం నెల రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే జెన్‌కో వద్ద ఉంది. .
ప్రవేటు రంగం జోరు ...!
కృష్ణపట్నం వద్ద గాయత్రి, ఎన్‌సిసి ధర్మల్‌ ప్రాజెక్టులు ప్రవేటు రంగంలో నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఒప్పందం ఉండడంతో నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి సాగుతోంది. 660 మెగావాల్ట్‌ రెండు యూనిట్స్‌ మొత్తం 1320 మెగావాల్ట్‌ ప్రతి రోజూ ఉత్పత్తి కావాల్సిఉంది. ఇక్కడ ఒక్కో యూనిట్‌లో కేవలం 450 మెగావాల్ట్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల వద్ద ఇండోనేషియా బొగ్గు 75 వేల టన్నులు. ఇతర దేశాల నుంచి వచ్చిన 28 వేల టన్నులు ప్రస్తుతం నిల్వ ఉంది. ప్రతి రోజూ 2400 టన్నులు వినియోగిస్తున్నారు. 40 రోజులకు సరిపడి నిల్వలు ప్రవేటు ధర్మల్‌ ప్రాజెక్టుల వద్ద ఉన్నాయి. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి జరుగుతుంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రవేటు ధర్మల్‌ ప్రాజెక్టు యాజమాన్యలు విదేశాల నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కోల్‌ ఇండియా, సింగరేణి చుట్టు తిరుగుతున్నాయి. ఈ పరిణామాలతో జెన్‌కో అధికారులు ఎవరూ వివరాలు చెప్పడానికి ముందుకురావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్‌ విషయంలో నోరుమెదపడం లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాపితంగా రాత్రి 6 నుంచి10 గంటల సమయంలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి.