
- జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానం విజయవంతంగా అమలు
- రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో ఆయన శ్రద్ధకు, చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. సోమవారం కాకినాడ ఆర్ఎంసీ వద్ద 15 సంచార వైద్య సేవల వాహనాల (104 వాహనాలు)ను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, జెడ్‌పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ 104 వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని గత మూడేళ్లలో 11 లక్షల మందికి పైగా ఈ వాహనాల ద్వారా సేవలు అందినట్లు తెలిపారు. మరో 15 వాహనాలు కొత్తగా అందుబాటులోకి రావడం వల్ల ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయని వివరించారు. ప్రతి హెల్త్ క్లినిక్ పరిధిలో నెలకు రెండుసార్లు ప్రజలకు 104 సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
- వైద్య సేవలు అందించడంలో అగ్రగామిగా నిలిపేందుకే : ఎంపీ వంగా గీత
కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలందరికీ వైద్య సేవలు అందాలనేది ఆయన ఆశయమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం ఆరోగ్యసేవలు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామ స్థాయిలో డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. 108, 104 వాహనాల సంఖ్యను పెంచడం ద్వారా మరింత మందికి వైద్య సేవలను చేరువచేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు ఈ పథకం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా చూస్తున్నట్లు ఎంపీ వంగా గీత వెల్లడించారు.