Feb 22,2021 20:58

న్యూఢిల్లీ : దాదాపు 11 నెలల తర్వాత కాశ్మీర్‌ లోయలో రైలు సర్వీసులను పునరుద్ధరించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో సర్వీసుల పునరుద్ధరణపై రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. తాజా పునరుద్ధరణ ద్వారా ప్రజలకు సులభంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశంతో పాటు పర్యాటక రంగానికి పెద్ద బూస్టప్‌ ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. 'ఈనెల 22న కాశ్మీర్‌ లోయలోని బనిహాల్‌-బారాముల్లా సెక్షన్‌ పరిధిలో రైలు సర్వీసులను పునరుద్ధరించాం. ప్రస్తుతం ప్రాథమికంగా రెండు సర్వీసులు తిరుగుతున్నాయి' అని ట్వీట్‌ చేశారు. అన్ని ప్యాసింజర్‌ రైలు సర్వీసుల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ అంతకుముందు పేర్కొంది. కరోనా నేపథ్యంలో రద్దు చేసిన రైలు సర్వీసులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా తిరిగి పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 65 శాతానికి పైగా రైళ్లు తిరుగుతున్నాయని, మిగతా సర్వీసులు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.