Sep 27,2021 01:47

మాట్లాడుతున్న కోడా సింహాద్రి

పాడేరు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 11వ పిఆర్‌సిని 55 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడా సింహాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ అపరిష్కృత ఐదు డిఎలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన నాటి నుంచి నిత్యావసర ధరలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదల ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పిఆర్‌సిని 2018 నుంచి ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందని, నివేదికను ప్రభుత్వానికి అందించి చాలా కాలం అయినప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కూడా బిసిఎను 11వ పిఆర్‌సిలో పునరుద్ధరించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. సోమవారం నిర్వహించే భారత్‌ బంద్‌కు తమ సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.కొండలరావు, మాజీ అధ్యక్షులు ఎస్‌.గంగరాజు, నేతలు సిద్ధేశ్వరరావు, ఎస్‌.పితాంబర్‌, ఎం.త్రినాధ్‌, తదితరులు పాల్గొన్నారు.