Jul 21,2021 20:11

మాన్సాస్‌ కార్యాలయం

ప్రజాశక్తి -కంటోన్మెంట్‌ : జీతాలు చెల్లించాలని కోరినా మాన్సాస్‌ ఉద్యోగులపై ఇఒ కేసులు పెట్టారు. 12 మంది ఎంవిజిఆర్‌ కళాశాల ఉద్యోగులపై ఇఒ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాన్సాస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నాలుగు రోజుల క్రితం మాన్సాస్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ఇఒ మరోవైపు ఉద్యోగులపై తన విధులకు ఆటంకం కలిగించారని, కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించారని 12 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొంతమందిని కూడా ఇందులో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎంత మందిపై కేసులు నమోదు చేశారు అనేదానిపై కూడా స్పష్టత పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. జీతాలు చెల్లించాలని అడిగినందుకు కేసులు పెట్టడం పట్ల ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
జీతాలు అడిగితే కేసులు నమోదు చేయడం దుర్మార్గం
జీతాలు అడిగితే కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని కేంద్ర మాజీమంత్రి, మాన్సాస్‌ చైర్మన్‌ పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. బుధవారం తన బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది జీతాల సమస్య ఇంత వరకు మాన్సాస్‌లో ఎప్పుడూ లేదని అన్నారు. ఇప్పుడు ఆ జీతాల చెల్లింపును అక్కడ అధికారులు ఓ సమస్యగా భావించటం బాధాకరమని తెలిపారు. సిబ్బంది లేకపోతే ఏ సంస్థకైనా మనుగడే ఉండదని అన్నారు. ఇఒ చర్యలు సంస్థను ఉద్ధరించేవిగా లేవన్నారు. 'జీతమడిగితే కేసులు పెడతారా? ఇంతకీ..సిబ్బందిని మీరేమి చేయాలనుకుంటున్నారు' అని ఇఒను ప్రశ్నించారు.