
విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో కొనసాగిస్తోన్న రిలే నిరాహారదీక్షలు మంగళవారంతో 12 వ రోజుకు చేరాయి. ఈ శిబిరాన్ని పూర్వ స్టీల్ అధికారి ఎం.కృష్ణారావు ప్రారంభించారు. వీరితో పాటు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, మురళీరాజు, వై.టి.దాస్, గంధం వెంకట్రావు, కె.ఎస్.ఎన్, గణపతి రెడ్డి వరసాల శ్రీనివాస్, సిహెచ్.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు. 12 వ రోజు దీక్షలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి CMM, CME, ETL, TELECOM, ACS విభాగాల నుంచి కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వీరినుద్దేశించి నేతలు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేని కారణంగానే ఈ అప్పులు పెరిగాయని వివరించారు. ఈ పోరాటం పెట్టుబడిదారులకు, కార్మికవర్గానికి మధ్య జరుగుతున్న పోరాటంగా భావించి ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమానికి సంఘీభావంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.లచ్చి రాజు మాట్లాడుతూ.. బిఎస్ఎన్ఎల్ ను చంపిన కేంద్ర ప్రభుత్వం అంబానీ ''జియో'' కి పెద్ద ఎత్తున సాయపడిందని విమర్శించారు. ప్రభుత్వం దుర్మార్గమైన విధానాలతో బిఎస్ఎన్ఎల్ లో ఉపాధిని దెబ్బతీశాయన్నారు. ఉపాధిని రక్షించుకోవడం కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపడం అందరి ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఇ.సిహెచ్.వి.సాగర్, కార్మికులు పాల్గొన్నారు.