Oct 13,2021 09:19

కేరళలోని కన్నూరుకు చెందిన పదహారేళ్ల గాయని సుచేత సతీష్‌ ఏడు గంటల 20 నిమిషాల్లో 120 పాటలు పాడి పాత రికార్డ్‌ను బద్దలు కొట్టి... గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కింది.
దుబారులోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియంలో తాజాగా జరిగిన 'మ్యూజిక్‌ బియాండ్‌ బోర్డర్స్‌' కచేరీలో సుచేత 120 పాటలను పాడింది. వీటిలో 29 ఇండియన్‌ భాషలు, 91 ఇతర దేశ భాషల్లో, మొత్తం 120 పాటలను పాడింది. సుచేత చిన్నవయస్సులో మలయాళ చిత్రం 'ధ్వని'లోని 'జానకి జానే' అనే సంస్కృత పాటను పాడి తన సంగీత జీవిత ప్రయాణాన్ని ప్రారంభించింది. తల్లి సుమిత బాలీవుడ్‌ రచయిత.
సుచేత మూడేళ్ల వయసులో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత హిందుస్తానీపై పట్టు సాధించింది. ప్రసిద్ధ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఆశా మీనన్‌ ఆమెకు తొలి గురువు. ఆ తర్వాత సుజాత హరీష్‌ కుమార్‌, జయప్రసాద్‌లు హిందూస్తానీలో ఓనమాలు నేర్పించారు. ఈ క్రమంలోనే సుచేత తన 12 ఏళ్ల వయసులో 102 భాషల్లో పాటలు పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి దుబారు మంచి వేదిక అయ్యింది. భిన్నమైన భాషల్లో పాటలు పాడేటప్పుడు ఇబ్బంది పకుండా తన తోటి సింగర్స్‌ తనకు ఎంతో సహాయం చేశారని సుచేత వివరించింది. అన్ని భాషల్లోనూ పాడుతున్న సుచేత ఉచ్ఛారణ చాలా స్పష్టంగా, ఎక్కడా తప్పు లేకుండా పాడి ప్రేక్షకులనే కాకుండా వేదికపై ఉన్న అతిధిలను సైత్యం ఆశ్చర్యపరిచింది. ఈ విజయంతోనే ఈ ఏడాది నవంబర్‌ 19న దుబారులో తన మొదటి సోలో లైవ్‌ ప్రదర్శనకు సిద్ధమవుతోంది.