
- పాఠశాల విద్య కమిషనరు సురేష్‌కుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద 14,192 మంది ఎంపికయ్యారని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్‌టిఇ చట్టం కింద 25 శాతం ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో అడ్మిషన్ కేటాయించబడని పిల్లలు, రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న పిల్లలను లాటరీ ద్వారా ఎంపిక చేశామన్నారు. ఈ విద్యార్థుల జాబితా వివరాలు, వారికి కేటాయించిన పాఠశాలల వివరాలను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష, ఎడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారికి పంపించామని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు పాఠశాలల వివరాలు, సమాచారాన్ని సందేశాల ద్వారా పంపించామని పేర్కొన్నారు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 24 నుంచి 28లోపు చేరాలని కోరారు. అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు నిర్ణయించిన తేదీల్లోపు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.