Apr 07,2021 22:24

న్యూఢిల్లీ బ్యూరో : అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 14న సంవిధాన్‌ బచావో ఆందోళనను దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిర్వహిస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తెలిపారు. రైతాంగ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోడీ సర్కార్‌పై రానున్న రోజుల్లో మరింత సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పంజాబ్‌లో బుధవారం నిర్వహించిన ఎఐఎడబ్ల్యుయు, బికెఎంయు సంయుక్త సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద శక్తులు నిత్యం దళితుల హక్కులు, అవకాశాలపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మనుధర్మ రాజ్యాంగంగా మార్చేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావొస్తున్నా దళితులు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 27 కోట్ల మంది దళితులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వల్ల రైతులతోపాటు వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పంజాబ్‌లో ప్రారంభమైన రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. ఉద్యమం పట్ల కేంద్రం ఒంటెత్తు పోకడలకి పోతుందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయడం తగదన్నారు. దళితుల అభ్యున్నతి, హక్కుల కోసం తమ సంఘాలు ఐక్యంగా పోరాడతాయన్నారు. సదస్సులో బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి గోరియా, ఎఐఎడబ్ల్యుయు నేతలు నురిపూరి, లాల్‌సింగ్‌, రాధాకుమారి తదితరులు పాల్గన్నారు.

రైతులకు మద్దతుగా మహిళ మహా పంచాయత్‌
న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హర్యానాలోని హిసార్‌లో మండి టోల్‌ ప్లాజా వద్ద బుధవారం మహిళ మహా పంచాయత్‌ జరిగింది. మహిళల ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళ రైతులు, కార్మికులు పాల్గన్నారు. మోడీ ప్రభుత్వానికి, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 131వ రోజుకి చేరింది. రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 353 మంది రైతులు వీర మరణం పొందారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రియంవద సింగ్‌ తోమర్‌ తన పదవికి రాజీనామా చేశారు. బిజెపి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆమె విమర్శించారు. ముజఫర్‌ నగర్‌లోని మీరాపూర్‌ అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే అవతార్‌ సింగ్‌ భదానా పార్టీకి రాజీనామా చేశారు. యుపి మహిళ కమిషన్‌ సభ్యురాలు, ఇతర బిజెపి నాయకులు తమ పదవులకు రాజీనామా చేయడాన్ని ఎస్‌కెఎం సమన్వయ కర్త దర్శన్‌ పాల్‌ స్వాగతించారు.