
ప్రజాశక్తి-విజయనగరం: వచ్చే 15 రోజుల్లో అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు తెలిపారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కలెక్టర్ సూర్య కుమారి ఆధ్వర్యంలో ఎస్సి సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల ద్వారా ఎస్సిలకు అమలు చేస్తున్న పథకాలు, ఖర్చు చేస్తున్న నిధులపై సమీక్షించారు. బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవరోధాలూ లేవని, పోస్టులకు తగ్గ అర్హత గల అభ్యర్థులు లేకపోతే సడలింపు కోసం ప్రభుత్వానికి రాసి నియామకాలు జరపాలని సూచించారు. ఎస్సిల కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయడం లో అధికారులు చిత్త శుద్ది చూపాలన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఎస్సి వారికీ వేరేగా కేటాయించకుండా ఇతరులతో కలిపి వారి మధ్యనే గృహాలు కేటాయించాలని సూచించారు. హౌసింగ్ పీడీ రమణ మూర్తి మాట్లాడుతూ జగనన్న లే ఔట్లలో అన్ని ప్రాథమిక వసతులతో కూడిన గృహాలను12 శాతం ఎస్సిలకు కేటాయించినట్లు తెలిపారు. చేయూత పథకం కింద ఎంత మంది ఎస్సిలకు లబ్ధి చేకూరిందని చైర్మన్ అడగడంతో డిఆర్డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ సుమారు రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సామజిక పరంగా రుణాలు అందించి ప్రోత్సహించాలని, చేయూత కింద పాడి గేదెలను అందించాలని చైర్మన్ తెలిపారు. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ల జారీకి ప్రతి మండలంలో ప్రతి నెలా సదరం క్యాంపులను ఏర్పాటు చేసి వారికి సదరం సర్టిఫికేటలను అందజేయాలని సూచించారు. అర్హతను బట్టి పింఛను కూడా మంజూరు చేయాలన్నారు. జిల్లా పరిషత్ నిధుల నుండి ఎస్సిలకు 15 శాతం కేటాయిస్తున్నామని జెడ్పి సిఇఒ డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా ద్వారా ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని తెలపగా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ ఉమా శంకర్ స్పందిస్తూ ఈ పథకం కింద ఇప్పటికే 12.9 శాతం ఎస్సిలను కవర్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లాలో 30 వసతి గహాలు ఉన్నాయని, వాటిలో 6 వసతి గృహాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయని, వాటికీ శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. జిల్లా యంత్రాంగం తరపున స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చైర్మన్ స్పందిస్తూ రాత పూర్వకంతా ప్రతిపాదనలను తయారు చేసి ఇవ్వాలని తెలిపారు. జిల్లా ఎస్పి దీపిక పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఈఏడాది 93కేసులు ఎస్సిలపై నమోదు అయ్యాయని, అందులో 3 కేసులు విచారణ లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో సభ్యులు అలజంగి జోగారావు, కంబాల జోగులు, చిట్టిబాబు, ఎంఎల్‌సి శ్రీనివాసులు రెడ్డి, ఇందుకూరి రఘు రాజు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ గణపతి రావు, సోషల్ వెల్ఫేర్ డిడి సుధాకర్ , పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.