
వాషింగ్టన్ : కరోనా కొత్త వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా 18ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. ఏప్రిల్ 19నాటికల్లా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్‌తో మనం ఇంకా జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. ఈ నెల 19నాటికల్లా 18ఏళ్లు అంతకంటే పైబడిన వారికి వ్యాక్సిన్ అందేలా చూడాలని బైడెన్ రాష్ట్రాలను కోరారు. గతంలో మే 1వ తేదిగా వున్న ఈ గడువును రెండు వారాలు ముందుకు జరిపారు. పరీక్షలు ఇంకా కొనసాగుతున్నందున, 16 ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్ పొందే అర్హత ఇప్పుడే కల్పించలేమన్నారు. లక్ష్యంగా ప్రకటించిన కొత్త తేదీ నాటికి వ్యాక్సిన్లను ఇస్తామని చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇప్పటికే 80శాతానికి పైగా టీచర్లు, స్కూలు సిబ్బందికి ఒక విడత వ్యాక్సిన్ వేశారు. కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నందున కేసులు కూడా బాగా పెరుగుతున్నాయని బైడెన్ పేర్కొన్నారు. జులై 4 వచ్చే నాటికి ఈ మూడు మాసాల్లో ఎంతమందిని మనం రక్షించగలమనేది ఇప్పుడు మనం చేయాల్సిన పనని బైడెన్ వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు తాము అర్హులమా కాదా అని ప్రజలు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదని దేశవ్యాప్తంగా ప్రతి ఒ క్కరూ అర్హులేని బైడెన్ ప్రకటనతో స్పష్టమైందని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు గవర్నర్లు కృషి చేస్తున్నారని వైట్‌హౌస్ సిబ్బంది చీఫ్ రాన్ క్లెయిన్ తెలిపారు.