Jul 29,2021 23:47

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న చలపతిరావు

కలెక్టరేట్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖ పింఛనుదారులందరికీ ఇవ్వాల్సిన 3 డిఎ బకాయిలను, 18 నెలల పింఛన్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎపిఎస్‌ఇబి పింఛనుదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోణంకి చలపతిరావు డిమాండ్‌ చేశారు. విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పింఛను బకాయిలు చెల్లించాలని కోరుతూ సిఎమ్‌డికి, రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు, నోటీసులు పంపినప్పటికీ ఫలితం కనిపించడం లేదన్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ పెన్షన్‌ ఫండ్‌ నుంచే చెల్లించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1487 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. దీనిపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 2020 మార్చి లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పింఛన్‌ బకాయిలు ఉంటే 6 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. గత పే రివిజన్‌ 2018 ప్రకారం పింఛన్‌ దారులకు రావాల్సిన 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలని, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు ఆర్‌ వి రమణరావు పాల్గొన్నారు.