Sep 29,2020 21:56

19 నుండి దశలవారీగా విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్‌ డిస్కమ్‌ల ప్రైవేటీకరణ నిలిపేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని31 యూనియన్లతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జెఎసి హెచ్చరించింది. మంగళవారం విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో సిఎండి ఎన్‌ శ్రీకాంత్‌కు జెఎసి ఛైర్మన్‌ పి.చంద్రశేఖర్‌, కన్వీనర్‌ బి.సాయికృష్ణ, సెక్రటరీ జనరల్‌ ఎం.వేదవ్యాసారావు వినతిపత్రం, ప్రత్యక్ష కార్యాచరణకు సంబధించిన నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌టిపిపి, ఎన్‌టిటిపిఎస్‌ ప్లాంట్లను పూర్తిగా నడపాలని, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు 2020ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ బారినపడి మరణించిన విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బందికి అత్యవసర సర్వీసుల సిబ్బంది మాదిరిగా రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు అక్టోబర్‌ 19 నుండి 24 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన, 26 నుండి 31 వరకు నిరసనలు, నవంబరు 2 నుండి 7 వరకూ అన్ని సర్కిల్‌ కార్యాలయాలు, డివిజన్లు, కంపెనీ హెడ్‌క్వార్టర్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే నవంబరు 9 నుండి 14 వరకూ రిలేదీక్షలు, 16వ తేదీన భారీ ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు.