Jul 29,2021 20:15
సత్యబాబును పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర నేత బాబూరావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు

ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి : నూతన ఆస్తి పన్ను విధానం అమలుకు విఎంసి కౌన్సిల్‌లో 198 జిఒపై వైసిపి వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విపక్ష సభ్యులు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, కౌన్సిల్లో చర్చ లేకుండా జిఒను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. జిఒ 198ని కౌన్సిల్లో వైసిపి పాలకపక్షం ఏకపక్షంగా ఆమోదించుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు చేపట్టిన నిరాహార దీక్ష సుమారు 23 గంటల పాటు కొనసాగింది. అర్థరాత్రి రెండు గంటల వరకు విఎంసి ఆవరణలోనే దీక్షను కొనసాగించిన ఆయన్ను పోలీసులు కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింపజేస్తున్న సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్‌.బాబూరావు, చిత్రంలో జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు
 నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింపజేస్తున్న సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్‌.బాబూరావు, చిత్రంలో జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు

'ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వద్దు...చెత్తపై పన్ను సిగ్గు చేటు, పట్టణ ప్రజలపై భారాలు ఆపాలి' అంటూ ప్లకార్డును సత్యబాబు ప్రదర్శిస్తూ ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. సత్యబాబును పరామర్శించిన అనంతరం మధు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. విఎంసి పాలకపక్షం, అధికారులు పద్ధతి, విలువలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, పోలీసుల జోక్యం పెరిగిపోతోందని విమర్శించారు. సత్యబాబును సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, టిడిపి కార్పొరేటర్లు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, నాయకులు సంఘీభావం తెలిపారు.