Jan 19,2022 06:47

    1982, జనవరి 19న మన దేశం లోని ప్రధాన కార్మిక సంఘాలు సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్ధల యూనియన్లు ఒక చారిత్రాత్మక జాతీయ సమ్మెను నిర్వహించాయి. ఆ పోరాటంలో వ్యక్తమైన కార్మిక-కర్షక ఐక్యత, కార్మికోద్యమ నేతల దార్శనికత ప్రశంసనీయం. ఆ జాతీయ సమ్మె సందర్భంగా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయోగించిన దమన కాండ, దానిని ఎదుర్కొనే క్రమంలో చేసిన బలిదానాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
     ఆ సమ్మె జరిగి నలభై సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం భారత దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ఒకవైపు నయా ఉదారవాద విధానాలతో, మరోవైపు మతోన్మాద విధానాలతో దేశ ప్రజలమీద దాడి చేస్తోంది. ఈ దాడిని ఎదుర్కోడానికి కార్మికులు, కర్షకులు, ఇతర తరగతుల పేదలు సిద్ధమౌతున్నారు. అందుకోసం సాగించే పోరాటానికి నాలుగు దశాబ్దాల నాటి ఆ జనరల్‌ సమ్మె, దాని అనుభవాలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా 2022, జనవరి 19న ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఆనాటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాం. ఆనాటి వొరవడిని అందిపుచ్చుకుని ఉద్యమ బాటలో ముందుకు సాగుదాం.
     ఆనాటి సమ్మెకు ముందు ఒక ఏడాదికి పైగా ఉధృతమైన ప్రచారోద్యమం నడిచింది. 1981 జూన్‌ 4న దేశంలోని అన్ని కార్మిక సంఘాల జాతీయ సదస్సు ముంబైలో జరిగింది.ఆ సదస్సు ఆమోదించిన తీర్మానం, కార్యాచరణ కార్యక్రమం ప్రత్యేకత కలిగివున్నాయి. కార్మికుల డిమాండ్లతోబాటు, ఆ సదస్సు ప్రకటించిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం, వారికి సమగ్ర చట్టం, రైతులకు గిట్టుబాటు ధర, చౌకడిపోల ద్వారా నిత్యావసర సరుకుల అమ్మకం, నల్ల బజారు ను అరికట్టే కఠిన చర్యలు తదితర డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సాధన కోసం 1982 జనవరి 19న సమ్మె నిర్వహించాలని, దానికి ముందు విస్తృతంగా దేశవ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సదస్సులు, సభలు, ర్యాలీలు జరిగాయి. 1981 నవంబరు 23న దేశ రాజధానిలో ''మార్చ్‌ టు పార్లమెంట్‌'' జరిగింది. కార్మికులతోబాటు వ్యవసాయ కార్మికులు, రైతులు లక్షల్లో పాల్గొన్నారు. బెంబేలెత్తిన కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేశాయి. బెదిరింపులు, బలవంతపు బదిలీలు, అక్రమ కేసులు బనాయించాయి. అయినా, ఉద్యమం ముందుకే సాగింది.
 

                                            సమ్మెకారులపై పోలీసుల కాల్పులు, దమనకాండ

1982 జనవరి 19న ఉత్తర ప్రదేశ్‌ లో వారణాసి దగ్గర్లోని బనారస్‌-మీర్జాపూర్‌ రోడ్డుమీద కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, విద్యార్ధులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా సాగుతున్నారు. ఆ ఊరేగింపుకు రైతు నాయకుడు భోలా పాశ్వన్‌ ముందున్నారు. సమ్మె అత్యంత జయప్రదంగా సాగుతోంది. మొత్తం రోడ్డు రవాణా యావత్తూ బంద్‌ అయింది. ప్రశాంత వాతావరణంలో అత్యంత క్రమశిక్షణతో సాగుతున్న ఆ ఊరేగింపుపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండానే కాల్పులు జరిపారు. కామ్రేడ్‌ భోలా పాశ్వన్‌ ఆ కాల్పుల్లో మరణించారు. అయినా, నిరసనలు ఆగలేదు. ఆయన చిన్న తమ్ముడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అయిన లాల్‌చంద్‌ పాశ్వన్‌ నాయకత్వం వహించి ముందుకు నడిచాడు. పోలీసు తూటాలు ఆ యువకుడినీ బలిగొన్నాయి. ఆ కాల్పుల్లో, దమనకాండలో 32 మంది కామ్రేడ్లు గాయాలపాలయ్యారు. యు.పి పోలీసులు అమరులైన ఆ పాశ్వన్‌ సోదరులనిద్దరినీ ఆ స్థలానికి 75 కి.మీ. దూరంలో ఉన్న రాంసాంచీ అనే ప్రాంతానికి తీసుకుపోయారు. మృతుల కుటుంబాలకు సైతం కబురు చేయకుండానే మృతదేహాలను దహనం చేశారు.
     అదే రోజు, దక్షిణాదిలో తమిళనాట అన్నాడిఎంకె ప్రభుత్వ పోలీసులు కూడా తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. తిరుమజ్ఞానం అనే ఊళ్ళో శాంతియుతంగా ప్రదర్శనలో నడుస్తున్న వ్యవసాయ కార్మికులపై కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో వ్యవసాయకార్మికసంఘం కార్యకర్తలు కామ్రేడ్స్‌ అంజన్‌, నాగూరన్‌ అమరులయ్యారు. తిరుత్తలిపూండి లో పోలీసుల కాల్పులకు భారతీయ ఖేత్‌మజ్దూర్‌ యూనియన్‌ కార్యకర్త కామ్రేడ్‌ గుణశేఖరన్‌ బలయ్యాడు. మొత్తంగా ఆరోజున దేశవ్యాప్తంగా పోలీసుకాల్పులకు 10మంది మరణించారు. వారి బలిదానం దేశవ్యాప్త కార్మిక-కర్షక ఐక్య పోరాటాలకు పునాది వేసింది.
     మళ్లీ అదే తరహా ఐక్యత ఇటీవల జరిగిన రైతు ఉద్యమంలో వ్యక్తమైంది. ఏడాదికి పైగా సాగిన ఆ ఉద్యమంలో 700 మందికి పైగా రైతన్నలు అమరులయ్యారు. ఈ పోరాటంలో కార్మిక-కర్షక ఐక్యత వెల్లివిరిసింది. ఈ పోరాటం సందర్భంగా రైతులు, కార్మికులు తమకు అసలైన శత్రువులు కేవలం అధికారంలో ఉన్న బిజెపి మాత్రమే కాదని, బడా కార్పొరేట్ల ప్రయోజనాలకోసం అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలను ఓడించనిదే తమ సమస్యలు పరిష్కారం కావని గుర్తించారు. అందుకోసం తామంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కాకుండా కష్టజీవుల్లో చీలికలు, పరస్పర విద్వేషం సృష్టించడానికి మతోన్మాదాన్ని, కులఘర్షణలను పాలక పార్టీ రెచ్చగొడుతోందని వారు గమనించారు. ఈ ''అంబానీ-అదానీ సర్కారు'' కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ క్రమంలో అంబానీకి చెందిన జియో సిమ్‌లను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా గొప్ప స్పందన వచ్చింది. కార్మికవర్గం తన అసలైన శత్రువు ఎవరో గుర్తించగలగడం ఈ పోరాటపు మహత్తర విజయం. ఈ కార్మిక-కర్షక ఐక్య పోరాటం కేవలం రైతు చట్టాల రద్దు కోసమే గాక, నాలుగు లేబర్‌ కోడ్‌లనూ రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలిచింది. ఉపాధి హామీ పథకం, ప్రజా పంపిణీ వంటి అంశాలనూ లేవనెత్తింది.
     రైతన్నల విజయం అనంతరం ఆ ఉద్యమంలో భాగస్వాములైన సంఘాల నడుమ చర్చలు జరిగాయి. ఈ పోరాటంలో వ్యక్తమైన ఐక్యతను మరింత పటిష్టపరచుకోవాలని, కులం పేరుతోనో, మతం పేరుతోనో చిచ్చు పెట్టాలనే కుట్రలను తిప్పికొట్టి ఐక్యతను కాపాడుకోవాలని నిశ్చయించాయి. సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న నయా ఉదారవాద దోపిడీ విధానాలను ఓడించేవరకూ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.
    కార్మిక-కర్షక ఐక్యతకు పునాది వేసిన 1982. జనవరి 19 సమ్మెను, ఆనాటి అమరవీరుల బలిదానాలను స్మరించుకుంటూ 2022 జనవరి 19న కష్టజీవుల ఐక్యతకు, ఐక్య పోరాటాలకు పునరంకితం అవుదాం.
 

(హన్నన్‌ మొల్లా, విక్రమ్‌ సింగ్‌ల వ్యాసం ఆధారంగా)