May 17,2022 21:05

- జస్టిస్‌ చంద్రు ప్రారంభం
- పోస్టరు ఆవిష్కరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ఎస్‌టిఎఫ్‌ఐ (స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) 8వ జాతీయ మహాసభలు విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రం ఆడిటోరియంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరగనున్నాయని ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అభిజిత్‌ ముఖర్జి, సిఎన్‌ భారతి తెలిపారు. విజయవాడలోని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టరును వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్‌టిఎఫ్‌ఐ దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 31 ఉపాధ్యాయ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. ఈ సంఘాల నుండి మహాసభలకు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సభలను జస్టిస్‌ కె చంద్రు ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ఆయన ''సామాజిక న్యాయం'' అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. మహాసభల్లో ''మహిళలు-రక్షణ'' అంశంపై ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ''ఆర్థిక సంస్కరణలు-ప్రైవేటీకరణ'' అంశంపై జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుర్జీత్‌ మజుందార్‌, ''మతతత్వం'' అంశంపై తీస్తాసెతల్వాద్‌ తదితరులు మాట్లాడతారని అన్నారు.
ఎస్‌టిఎఫ్‌ఐ కేవలం ఉపాధ్యాయుల సమస్యలపై మాత్రమే కాకుండా సమాజంలో నెలకొన్న అసమానతలు, అన్యాయాలపై పోరాడుతుందని తెలిపారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక స్వాతంత్య్రానంతరం దేశప్రజలు సృష్టించిన సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే పనిలో ఉందన్నారు. రామమందిర్‌, మసీదు అంశాలను అడ్డుపెట్టుకుని మతకల్లోలాలు సృష్టిస్తోందని తెలిపారు. తాజ్‌మహల్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలను సైతం వివాదాల్లోకి లాగుతోందని విమర్శించారు. అంతేగానీ ప్రజలపై మోపిన పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలను, నిరుద్యోగాన్ని తగ్గించడం వంటి అంశాలు కేంద్రానికి ఏమాత్రం పట్టడం లేదని తెలిపారు. పేదవారికి విద్యను దూరం చేసేవిధంగా నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చి దేశంపై రుద్దుతోందని, విద్యను కూడా ప్రైవేటీకరణ చేసి బిజెపి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విధానంతో ప్రాథమిక విద్యకు తూట్లుపొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ విధానంతో ప్రభుత్వరంగ సంస్థలు, ఆస్తులన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతోందని తెలిపారు. ఇటువంటి ప్రజావ్యతిరేక, దేశద్రోహ విధానాలను ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ మహాసభల్లో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. 2020 నూతన విద్యావిధానాన్ని ఉపసంహరించాలి, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్లపై మహాసభ కొనసాగుతుందని తెలిపారు.
యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని పరీక్షపత్రాల మూల్యాంకన కేంద్రాల వద్ద సిపిఎస్‌ రద్దు చేయాలని, ఒపిఎస్‌ పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, 11వ పిఆర్‌సిలో ఇచ్చిన జిఒల్లోని అసంబద్ద అంశాలను సవరించాలని, పరీక్ష పత్రాల మూల్యాంకనం రేట్లను రూ.12లకు పెంచాలనే డిమాండ్లతో నిరసన చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి అమలు చేయాల్సిన 12వ పిఆర్‌సిపై ఇప్పటి వరకు నోరు విప్పలేదని, తక్షణమే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ మహాసభల నేపథ్యంలో 20న విజయవాడ నిర్మలా కాన్వెంట్‌ లేదా లలితా జ్యూవెలరీ షాపు నుండి ఎంబి విజ్ఞాన కేంద్రం వరకు ఉపాధ్యాయుల ర్యాలీ ఉంటుందని, ఉపాధ్యాయులు ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎ కృష్ణసుందరరావు, ఎస్‌పి మనోహర్‌కుమార్‌, బి గోపీమూర్తి తదితరులు పాల్గన్నారు.