Feb 07,2023 20:37

వాషింగ్టన్‌ : ఆర్థిక మాంద్యం భయాలతో విమానాల తయారీ దిగ్గజ కంపెనీ బోయింగ్‌ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తును ప్రారంభించింది. అమెరికాలోని అనేక ఐటి, ఐటియేతర కంపెనీలు వరుసగా సిబ్బంది ఉద్వాసనలకు వరుస కడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బోయింగ్‌ కంపెనీ తమ ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఈ ఏడాది 2000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. 2022లో 15,000 మందిని నియమించుకున్న ఈ కంపెనీ.. 2023లో మరో 10,000 మందిని తీసుకుంటామని ఇది వరకు ప్రకటించింది. తాజాగా ఆ ప్రయత్నాలను విరమించుకుంది. తమ మూడో వంతు ఉద్యోగులను భారత్‌లో టాటా కన్సల్టింగ్‌ సర్వీసెస్‌కు అవుట్‌సోర్సింగ్‌ చేస్తామని కంపెనీ పేర్కొంది. తయారీ, ఉత్పత్తి అభివద్ధిపై అధిక నిధులు వెచ్చించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని బోయింగ్‌ పేర్కొంది. ఉత్పత్తి, సర్వీసులు, టెక్నాలజీ అభివద్ధిపై దృష్టి సారించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. కొన్ని విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకోవాలని భావిస్తున్నామని.. ఈ లోటును భర్తీ చేసేందుకు పొరుగుసేవలను ఆశ్రయించనున్నామని బోయింగ్‌ వెల్లడించింది.