
న్యూఢిల్లీ : 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి ఉపశమనం లభించింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి.. ప్రస్తుత ప్రధాని మోడీతో పాటు పలువురికి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను దివంగత కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రి భార్య జకియా జఫ్రి దాఖలు చేశారు. గుజరాత్ 2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని అహ్మదాబాద్ గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇషాన్‌తో సహా 69 మంది మృతి చెందారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సిట్.. గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి మోడీతో సహా 64 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ క్లీన్‌చిట్‌ను మేజిస్ట్రేట్ కోర్టు సమర్థిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చగా... జకియా 2014లో గుజరాత్ హైకోర్టునున ఆశ్రయించారు. 2017లో గుజరాత్ హైకోర్టు క్రింది కోర్టు తీర్పును సమర్థించగా.. ఈ అల్లర్లలో భారీ కుట్ర జరిగిందని పేర్కొంటూ ఇషాన్ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.