
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ఛానల్ పనులు 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గుంటూరు ఛానల్ విస్తరణకు ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? భూసేకరణకు కేటాయించిన నిధుల పరిణామం ఎంత? ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయి? అని లక్ష్మణరావు ప్రశ్నించారు. భూ సేకరణకు రూ.113.39 కోట్లను కేటాయించినట్టు మంత్రి తెలిపారు. 2024 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ప్రతిపాదించినట్టు తెలిపారు.
వరికపూడిసెల చేపట్టండి : బొల్లా బ్రహ్మనాయుడు
అసెంబ్లీలో గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై స్పందించారు. జీరో అవర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వినుకొండ ఎమ్మ్లెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వరికపూడిసెల ఎత్తిపోతల పథకం వెంటనే చేపట్టాలన్నారు. రూ.1273 కోట్లు నిధులు కేటాయించినా ఇంత వరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, బొల్లాపల్లి, పుల్లలచెరువు మండలాలకు సాగు, తాగునీటి వసతి వస్తుందన్నారు. బొల్లాపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. నూజెండ్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు.
శంకర్ విలాస్ బ్రిడ్జిని చేపట్టండి : మద్దాలి గిరిధర్
ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ గుంటూరులోని శంకర్ విలాస్ వద్ద బ్రిడ్జిని విస్తరించాలన్నారు. సిఎం జగన్ ఈ బ్రిడ్జి విస్తరణకు రూ.132 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వెంటనే ఇందుకు తగినచర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి
నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. మిర్చి పంట తడిసిపోయిందన్నారు. అధికారులు వెంటనే రైతులకు సాయం అందించాలన్నారు. నర్సరావుపేటలో జెఎన్‌టియు యూనివర్సిటీ భవనాలను ప్రారంభించాలన్నారు.
విత్తనాలను సరఫరా చేయండి : శంకరరావు
పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఖరీఫ్‌సీజన్ త్వరలో ప్రారంభం అవుతుందని, విత్తనాలు సిద్ధం చేయాలని కోరారు. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు అందివ్వకపోవడం వల్ల తరచూ నకిలీ విత్తనాలు రంగప్రవేశం చేస్తున్నాయని, గతేడాది అచ్చంపేట మండలం తాళ్లచెరువులో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారని, ఇంత వరకు వారికి పరిహారం రాలేదని చెప్పారు. ఆర్‌బికేల ద్వారా విత్తనాల సరఫరాకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు.