Oct 03,2022 23:33
డ్రోన్‌ సర్వేను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ (పైల్‌)

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం వందేళ్ల తరువాత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వేకు సన్నద్ధ అయింది. సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శాటిలైట్‌ ఆధారంగా డ్రోన్‌ను ఉపయోగించి గ్రామాలు, పట్టణాల పరిధిలో భూ సర్వే పనులు ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా పొలం గట్ల వద్ద రైతుల మధ్య తరచుగా జరిగే వివాదాలు తొలగిపోతాయని, భూ హద్దు, దస్తావేజ్‌ సమస్యలు తొలగుతాయని, గ్రామాల్లో పొలాల మధ్య జరిగిన కబ్జాలు, వివాదాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. భూ సర్వే అనంతరం సంబంధిత భూమి యజమానికి క్యూ ఆర్‌ కోడ్‌తో పాస్‌బుక్‌ ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం పేరుతో డ్రోన్‌ల ద్వారా ఏరియల్‌ ఫ్యూ మ్యాపింగ్‌ చేపట్టారు.
బాపట్ల జిల్లాలోని వేటపాలెం, మార్టూరు, బల్లికురవ, కొల్లూరు మండల్లాల్లో 13 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ముందుగా సుమారు 40 వేల ఎకరాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా సర్వే చేపట్టనున్న గ్రామాల్లో పాత హద్దుల ఆధారంగా నలుదిక్కులా హద్దులను ఖరారు చేస్తున్నారు. అన్నిటిని జియో టాగ్‌ చేస్తున్నారు. శాటిలైట్‌ ఆధారిత డ్రోన్‌ భూ సర్వే కోసం ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ప్రతి 35 కిలోమీటర్లకు ఒక బేస్‌ స్టేషన్‌ పాయింట్స్‌ పెట్టారు. సర్వే జరిపే డ్రోన్‌ను గ్రామం పైన ఎగురుతూ వ్యవసాయ భూములతో సహా అన్నిటిని చిత్రీకరిస్తారు. గ్రామ కంఠం హద్దులను నిర్ణయిస్తారు. ఒకొక్కక్క గ్రామాన్ని విస్తీర్ణాన్ని బట్టి పలు భాగాలుగా డ్రోన్‌ చిత్రీకరిస్తుంది. సదరు గ్రామంలో ప్రాంతాల వారీగా తీసిన చిత్రాల ప్రింట్లను గ్రామ రెవెన్యూ సిబ్బంది తీసుకుని వెళ్లి రైతులను కలసి వాటిని చూయించి పొలం గట్ల మధ్య సమస్యలు ఉంటే వాటి గురించి చర్చిస్తారు. సమస్యలు లేని భూములకు సంబంధించి లాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లను రైతులకు ఇస్తారు. సమస్యలు ఉన్న భూముల విషయమై పరిష్కారం కోసం డిప్యూటీ తహశీల్దార్లను రెండేళ్ల కాల పరిమితిపై నూతనంగా నియమిస్తున్నారు. వీరు సమస్యలు ఉన్న రైతుల నుంచి అర్జీలు తీసుకుని సదరు సమస్యలను పరిష్కరిస్తారు. ఈ పక్రియ అంతా పూర్తయ్యాక రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పట్టాదార్‌ పాస్‌బుక్‌లు ఇస్తారు.రైతుకు సంబంధించి భూమి వివరాలతో విశిష్ట సంఖ్య ఇస్తూ, యజమాని ఆధార్‌, మొబైల్‌ నంబరుతో భూ రికార్డుల్లో చేరుస్తారు. ఈ భూ సర్వే పూర్తి అయితే భవిష్యత్‌లో భూ తగాదాలు ఏవీ ఉండవని, భూ యజమానికి తెలియకుండా ఎవరు మార్పులు చేసే వీలు ఉండదు.
సరిపడా సిబ్బంది లేక సర్వే పనుల్లో జాప్యం
గ్రామాల్లో భూ సర్వే చేపట్టాలంటే దానికి ముందు, తరువాత చాలా పని ఉంటుంది. డ్రోన్‌ ద్వారా జరుగుతున్న ఈ భూ సర్వే పూర్తి చేయాలంటే రెవెన్యూ, సర్వే శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్యయంతో పనులు జరగాల్సి ఉంది. సర్వే శాఖ వద్ద సరిపడా సిబ్బంది ఉన్నా రెవెన్యూ శాఖలో భూసర్వే కోసం కావలసిన సిబ్బంది తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. భూ సర్వే ప్రారంభదశలోనే ఆయా గ్రామాలు హద్దుల పనులు, రికార్డులు పని, రైతులతో చర్చలు జరపడం, ఆన్‌లైన్‌ వర్కు చేసేందుకు కావలసిన సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ప్రధానంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పలు రకాల విధుల్లో ఉంటున్న నేపథ్యంలో సర్వే పనుల్లో జాప్యం జరుగుతందని తెలుస్తుంది.
సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు
శాటిలైట్‌ ఆధారిత డ్రోన్‌ సర్వేలో తలెత్తుతున్న సమస్యల వలన సర్వే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్రోన్‌ ఎగిరిన సమయంలో కొద్దిపాటి మేఘాలు ఉన్నా, జల్లు పడినా చిత్రాలు రావు. సర్వేకు ముందు గ్రామ హద్దులను ఖచ్చితంగా నిర్ణయించకపోయినా సర్వే నిరుపయోగం అవుతుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో రకరకాల కారణాలతో రీ సర్వేలు చేయాల్సి వచ్చింది. గ్రామ స్థాయి నుంచి జరుగుతున్న ఈ సర్వేలో సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా డ్రోన్‌ చిత్రాలు సక్రమంగా రావు. రాష్ట్రంలో 2020 డిసెంబరులో ప్రారంభించిన ఈ భూ సర్వే అనంతరం పలు కారణాలతో ముందుకు సాగలేదు. ఈ సర్వే కోసం రాష్ట ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాకు చేయాల్సిన చెల్లింపుల్లో జాప్యం ఒక కారణంగా ఉందని తెలుస్తుంది. ఈతరువాత కూడా సర్వే పనులు సాంకేతిక కారణాలతో సక్రమంగా ముందుకు సాగలేదు. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే బాపట్ల జిల్లాలో కొంత మెరుగుగా భూ సర్వే జరిగినట్లు తెలుస్తుంది.
జిల్లాలో 74 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పనులు పూర్తి
బాపట్ల జిల్లాలో 277 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో 74 గ్రామాల్లో భూ సర్వే కు సంబంధించి డ్రోన్‌ పనులు పూర్తి అయినట్లు జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు కె మురళీకృష్ణ తెలిపారు. ఇందులో 33 గ్రామాలకు సంబంధించి డ్రోన్‌తో తీసిన చిత్రాల ప్రింట్‌లను ఇచ్చారు. వీటిలో 21 గ్రామాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది సదరు డ్రోన్‌ చిత్రాల ప్రింట్‌లతో రైతును కలసి భూ సర్వే పనులు పూర్తి చేసి నెంబరు 13 నోటీఫికేషన్‌ ఇచ్చారు. జిల్లాలోని ఈ 21 గ్రామాలలోని రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పట్టాదార్‌ పాస్‌బుక్‌లు ఇవ్వనున్నారు.