Jan 13,2021 21:18

అమరావతి బ్యూరో: రైతుల పోరాటానికి మద్దతుగా ఈ నెల 21న విజయవాడలో సంఘీభావ సదస్సు నిర్వహించనున్నట్లు వామపక్షాలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా రాష్ట్రంలోని పార్టీలను ఆహ్వానించి ఈ సదస్సు జరపాలని నిర్ణయించినట్లు తెలిపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపిితో సహా వివిధ రాజకీయ పార్టీలను సదస్సుకు హాజరు కావాలని కోరాయి. ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేశాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500 రైతు సంఘాలతో ఏర్పడిన ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయని తెలిపాయి. రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ నిర్బంధం, తీవ్రమైన చలి, వర్షం తదితర ఇబ్బందులను సైతం ఎదుర్కొని రైతులు తమ నిరసనను గత 50 రోజులుగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి. అనేక రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇప్పటికి దాదాపు 60 మంది రైతులు మరణించారని తెలిపాయి. ఎనిమిది విడతలు చర్చలు జరిగినా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడడం లేదని పేర్కొన్నాయి. మూడు నల్ల చట్టాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఆర్డర్‌ విధించి నలుగురు సభ్యులతో కమిటీని నియమించిందని తెలిపాయి. ఈ కమిటీ ప్రక్రియలో పాల్గనేది లేదని, ఆ నల్లచట్టాలు రద్దయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతుసంఘాల కోఆర్డినేషన్‌ కమిటీ ప్రకటించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు పి.మధు (సిపిఎం), కె.రామకృష్ణ (సిపిఐ), బి.బంగార్రావ్‌ (సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌), జాస్తి కిషోర్‌బాబు (సిపిఐ ఎంఎల్‌), కాటం నాగభూషణం (ఎంసిపిఐ యు), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ), బిఎస్‌ అమర్‌నాథ్‌ (ఎస్‌యుసిఐ సి), పి.వి.సుందర రామరాజు (ఫార్వర్డ్‌బ్లాక్‌), జానకిరాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) సంయుక్తంగా బుధవారం ప్రకటన విడుదల చేశారు.