
ప్రజాశక్తి-కలెక్టరేట్ : జిల్లాలో 22,472 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధులు మంజూరయ్యాయి. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.11,65,75,221 కోట్లు జమయ్యాయి. బుధవారం జగనన్న విద్యా దీవెన నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు, విద్యార్థులకు నమూనా చెక్కులను కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెనతో ఉన్నత విద్యను సాకారం చేసుకోవాలని కోరారు. కళాశాలలో చదువుతున్న ప్రతి పేద విద్యార్థి చదువుకయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉన్నత చదువే లక్ష్యం
పాలకొండ రూరల్ : విద్యార్థుల ఉన్నత చదువే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత చెక్కుల పంపిణీలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 5,997 విద్యార్థులకు రూ.2,86,82,939 మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బొమ్మాళి భాను, వైస్ ఎంపిపి కనపాక సూర్య ప్రకాష్, సీతంపేట ఎంపిపి ఆదినారాయణ, రాము, ఎజిపి చందక జగదీష్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి కృష్ణ, ఎంపిడిఒ త్రినాథులు పాల్గొన్నారు.
విద్యాదీవన విద్యార్థులకు వరం
కురుపాం : జగనన్న విద్యా దీవన విద్యార్థులకు వరమని ఎంపిపి శెట్టి పద్మావతి అన్నారు. స్థానిక వైకెపి కార్యాలయంలో ఎటిడబ్ల్యుఒలు కె.చంద్రబాబు, సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ నాలుగో విడత జగనన్న విద్యాదీవెన చెక్కులను ఆమె పంపిణీ చేశారు. రూ.2.99 కోట్ల చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ నిసార్, జెడ్పిటిసి జి.సుజాత, సర్పంచ్ గార్ల సుజాత, ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, ఎంపిటిసి వి.బంగారు నాయుడు, అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ జి.విజయ చంద్రశేఖర రావు, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కె. సురేష్ కుమార్ పాల్గొన్నారు.