Nov 21,2020 21:44

బీజింగ్‌ : కోవిడ్‌ నేపథ్యంలో నిరుపేద దేశాలకు సాయపడాలన్న జి-20 చొరవలో భాగంగా 23 పేద దేశాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనా ఆర్థిక మంత్రి లియూ కున్‌ మాట్లాడుతూ, ఆ రుణాల మొత్తం 135.3కోట్ల డాలర్లు దాకా ఉంటుందని, మరో 74.8కోట్ల డాలర్ల మొత్తాన్ని అభివృద్ధి బ్యాంక్‌ స్తంభింప చేసిందని చెప్పారు. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకు మరింతగా ఆర్థిక సాయం అందించేందుకు చైనా సుముఖంగా వుందని, వ్యాక్సిన్‌ సరఫరా సమయంలో వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. గత జూన్‌లో కొన్ని ఆఫ్రికన్‌ దేశాలకు ఇచ్చిన రుణాలను రద్దు చేస్తామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. చైనా ఇచ్చిన ఆ వడ్డీరహిత రుణాలను ఈ ఏడాది చివరినాటికల్లా చెల్లించాల్సి వుంది. కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమై, ఆర్థికంగా బాగా దెబ్బతిన్న దేశాలకు ఈ ప్రయోజనం అందుతుందని ఆయన అప్పుడే చెప్పారు. ఇతర రకాలుగా కూడా మద్దతు అందించేందుకు, రుణాలను స్తంభింపచేసేలా చైనాలోని సంస్థలను ప్రోత్సహించేందుకు, మార్కెట్‌ నిబంధనల ఆధారంగా ఆఫ్రికన్‌ దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. మరింత సాయమందించేందుకు, సరఫరాలు పెంచేందుకు, కొవిడ్‌పై పోరులో నిపుణులను అందించేందుకు కూడా తమ వద్ద ప్రణాళికలు వున్నాయని జిన్‌పింగ్‌ తెలిపారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు, ఆ ప్రాంతంలో పలు ఆస్పత్రులు నిర్మించేందుకు కూడా చైనా ముందుకొచ్చింది.