May 14,2022 08:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 24 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు ఉన్నత విద్యామండలి అనుమతులు రద్దు చేసింది. మూడేళ్లుగా గుర్తింపు తీసుకొని, అడ్మిషన్లు చేపట్టని 41 కళాశాలలకు, కోర్సుల అనుమతి తీసుకొని అడ్మిషన్లు చేపట్టని 209 కళాశాలలకు ఉన్నత విద్యామండలి గతంలో షోకాజ్‌ నోటీసులు అందించింది. ఈ నోటీసులకు కళాశాలలు రాతపూర్వక సమాధానాలు ఇచ్చాయి. వీటిపై ఉన్నత విద్యామండలి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏప్రిల్‌ 7న ఉన్నత విద్యామండలికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా 24 కళాశాలల అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. 442 కోర్సులను నిర్వహించేందుకు 209 కళాశాలలు అనుమతులు తీసుకున్నాయని, వీటిల్లో కూడా మూడేళ్ల నుంచి అడ్మిషన్లు చేపట్టడం లేదని నోటీసులు ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా 2021-22 విద్యాసంవత్సరం నుంచి 24 కళాశాలల అనుమతులను, 209 కళాశాలల్లో 354 కోర్సుల నిర్వహణను రద్దు చేసింది.