
ప్రజాశక్తి - గ్రోత్సెంటర్ (ప్రకాశం జిల్లా) పరిశ్రమలకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఎపిసిపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజనార్ధన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారిశ్రామిక రంగాల సంతృప్తి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గుళ్ళాపల్లి గ్రోత్ సెంటర్లోని జ్యోతి గ్రానైట్, జ్యోతి క్వార్డ్జ్ సర్ఫేసెస్ పరిశ్రమలను గురువారం ఆయన సందర్శించారు. విద్యుత్ పరికరాల నిర్వహణ, భద్రతా వ్యవస్థకు సంబంధించి జ్యోతి గ్రానైట్ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పరిశ్రమలకు, వ్యవసాయ రంగాలకు మెరుగైన, నాణ్యమైన సరఫరా కోసం విద్యుత్ లైన్ లాస్ లేకుండా సుమారు రూ.రెండు వేల కోట్లతో ఆర్డిఎస్ఎస్ పథకం అమలు కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ పథకంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలు సరిదిద్ది అవసరమైన ప్రాంతాల్లో నూతన పరికరాలు ఏర్పాటు చేసి చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ద్వారా ఎనర్జీ సేల్స్ పెరిగి విద్యుత్ సంస్థ లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కె సత్యనారాయణ, ఇ.ఇ. మస్తాన్రావు, ఎడి మోహనరావు, ఇఇ కరీం, ఎఇ రవి ప్రకాష్ పాల్గొన్నారు.